బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉంది. పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ పై ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఫలితంగా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చు. ఈ తుఫాన్ కు ‘మాండస్’ అని పేరు పెట్టింది యూఏఈ. అరబిక్ బాషలో మాండస్ అంటే నిధుల పెట్టె! ఈ ఏడాది బంగాళాఖాతంలో ఏర్పడనున్న రెండో తుఫాన్ ఈ మాండస్. అక్టోబర్ లో సిత్రంగ్ తుఫాన్.. బంగ్లాదేశ్ లో బీభత్సం సృష్టించింది. ఇక ఇప్పుడు.. మాండస్ తుఫాన్ ఈ నెల 8న తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘మాండస్’ అనే పేరు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు ఆందోళన కలిగించింది. ఈ వారంలో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం పొరుగున ఉన్న అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని, డిసెంబర్ 6 సాయంత్రం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని భారత వాతావరణ శాఖ (IMD) సోమవారం తెలిపింది. అల్పపీడనం తుఫానుగా మారి డిసెంబర్ 8 ఉదయం నాటికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో నైరుతి బంగాళాఖాతం చేరుకుంటుంది. దీని ప్రభావంతో మంగళవారం అండమాన్ నికోబార్ దీవుల్లో తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
డిసెంబర్ 7 అర్ధరాత్రి నుండి ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. డిసెంబరు 8న ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, డిసెంబర్ 9న తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబరు 7న గాలుల వేగం క్రమంగా గంటకు 55-65 కి.మీలకు పెరిగి గంటకు 75 కి.మీలకు చేరుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు డిసెంబర్ 8న అదే ప్రాంతంలో గంటకు 70-80 కి.మీ వేగంతో పరుగెత్తుతుందని, డిసెంబర్ 8న ఇక్కడ గాలుల వేగం 90 కి.మీ.లకు చేరుకునే అవకాశం ఉందన్నారు. డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 8 వరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని నైరుతి, పరిసర ప్రాంతాలలో సముద్రం చాలా ఉధృతంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ సూచన పేర్కొంది. డిసెంబర్ 7, 9 తేదీల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, శ్రీలంక తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. మరోవైపు డిసెంబరు 8న ఈ తీరాల్లో సముద్ర పరిస్థితి మరీ దారుణంగా ఉండే అవకాశం ఉంది.