తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 3.20 గంటలకు రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. జిల్లాలోని కోహీర్ మండలం బిలాల్‌పూర్‌లో భూకంపం రావడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వారు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నల్గొండకు 117 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. ఇంతకు ముందు గత జనవరిలోనూ కోహీర్ మండలంలో పలుచోట్ల భూకంపం వచ్చిన విషయం తెలిసిందే.