తెలంగాణ రాష్ట్రంలో రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రంగంలోకి దిగిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా తెలంగాణా భవన్ లో ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇప్పటివరకు ప్రజాక్షేత్రంలోకి రాని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి నెలలో ప్రజల మధ్యకు వస్తారని పేర్కొన్నారు. కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండడమే ప్రత్యర్థి పార్టీలకు తలనొప్పి అని పేర్కొన్నారు. సీఎం అనే రెండు అక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే చాలా పవర్ఫుల్ అని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ఇక ఇదే సమయంలో ఖమ్మం, నల్గొండ వంటి ఒకటి రెండు జిల్లాలలో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదనడానికి మనం సాధించిన ఫలితాలే నిదర్శనమని ఆయన తెలిపారు. 39 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకోవడంతోపాటు, 11 స్థానాలలో అత్యల్ప మెజారిటీతో స్థానాలను కోల్పోయామన్నారు. ప్రజలలో ఉన్న అసంతృప్తికి గల కారణాలను సమీక్ష చేసుకొని ముందుకు వెళదామని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు.
ఈసారి ఖమ్మం సీటును ఏ విధంగా అయినా గెలవాల్సిందేనని కేటీఆర్ పార్టీ నేతలకు చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిందని, అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు.
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలకు భిన్నంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని, ప్రజలలో ఇప్పటికే అసహనం ప్రారంభమైందని కేటీఆర్ తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని అతి తక్కువ కాలంలోనే కోల్పోవడం కాంగ్రెస్ పార్టీ లక్షణం అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల పక్షాన పని చేయాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్.