తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను రాయితీతో చెల్లించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ ఇవాళ్టితో ముగిసింది. దీనికి వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. అయితే సర్వర్ సమస్యల కారణంగా ఆన్ లైన్లో ఎక్కువ మంది ఈ అవకాశం వినియోగించుకోలేకపోయామంటూ ఫిర్యాదులు చేశారు. దీంతో వీరంతా చెల్లింపు కేంద్రాలకు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువును ఈ నెలాఖరు వరకూ పెంచింది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 3.59 కోట్ల చలానాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో ప్రభుత్వం డిసెంబర్ 25 వరకూ విధించిన చలానాలపై భారీగా రాయితీ ప్రకటించింది. బైక్ లు, ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలు అన్నింటికీ 60 శాతం రాయితీతో చలానాలు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వాహనదారుల నుంచి భారీ స్పందన వచ్చింది.
తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 3.59 కోట్ల చలానాల్లో ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ ను వాడుకుని ఇవాళ్టి వరకూ 1.05 కోట్ల చలానాలను వాహనదారులు చెల్లించేశారు. దీంతో ప్రభుత్వానికి రూ.107 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే చాలా చోట్ల సర్వర్ పనిచేయడం లేదనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆన్ లైన్లో చెల్లింపులు చేయడం అసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో వాహనదారులు చలాన్ల చెల్లింపు కేంద్రాల వద్ద బారులు తీరారు. గడువు పొడిగించాలని ప్రభుత్వానికి వినతులు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జనవరి 31 వరకూ డిస్కౌంట్ తో చలానాలు చెల్లించేందుకు వాహనదారులకు మరో అవకాశం ఇచ్చింది.