TELANGANA

జగన్ బాటలో రేవంత్, వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం..

ఏపీలో సక్సెస్ అయిన వాలంటీర్ల వ్యవస్థ తెలంగాణలో ఏర్పాటు కానుంది. సంక్షేమ పథకాలు ఏపీలో ప్రజల ఇంటి ముందుకు తీసుకెళ్తున్న వాలంటీర్ల వ్యవస్థ పైన ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ విధానం అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటులో భాగంగా వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుడుతోంది. దాదాపు 80 వేల వాలంటీర్ల ఉద్యోగాల నియామకాలు చేపట్టనున్నట్లు సమాచారం.

 

వాలంటీర్ వ్యవస్థ : తెలంగాణ ప్రభుత్వం ఏపీ అమలు చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థ అమలు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ గురించి ఎన్నికల ముందే కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పన సమయంలో చర్చ జరిగింది. ప్రజలకు మేలు చేసే ఏ నిర్ణయమైనా అమలు చేయటానికి వెనుకాడమని నాడు కాంగ్రెస్ ముఖ్యులు స్పష్టం చేసారు. ఇందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గ్రామ గ్రామన ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటుకు నిర్ణయించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్లటంతో పాటుగా..అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు అందేలా చూడాలనేది ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందుకు వాలంటీర్ వ్యవస్థ ఎంపిక చేయాలని భావిస్తోంది.

 

పథకాలు చేరువయ్యేలా : ఆరు గ్యారెంటీల అమలు కోసం గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ గ్యారంటీల అమలుతో పాటుగా ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు వాలంటీర్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ కమిటీల ద్వారా వాలంటీర్ల వ్యవస్థతో ప్రతీ ఇంటికి పథకాలను అందేలా చూడాలనేది అసలు లక్ష్యంగా పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయితీలు, 142 మున్సిపాల్టీలు ఉన్నాయి. వీటి పరిధిలో సేవలు అందించేందుకు దాదాపుగా 80 వేల మంది వాలంటీర్లు అవసరం అవుతారని అంచనా వేస్తున్నారు. ఏపీలో వాలంటీర్లకు ప్రతీ నెలా రూ 5 వేల గౌరవ వేతనం అందిస్తున్నారు. మరో రూ 750 ప్రోత్సాహకంగా ఇస్తున్నారు.

 

ప్రభుత్వం కసరత్తు : ఇప్పుడు తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తే వారికి చెల్లింపులు ఎలా ఉంటాయనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటుగా.. ప్రభుత్వ నిర్ణయాలను వీరి ద్వారా ప్రతీ ఇంటికి చేరేలా చేయటంలో వీరి పాత్ర కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే, వాలంటీర్ల వ్యవస్థగానే ఈ విధానాన్ని కొనసాగిస్తారా లేక ఇందిరమ్మ కమిటీల పేరుతోనే అమలు చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే, వాలంటీర్ల తరహాలోనే తెలంగాణలోనూ సేవలను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. దీని పైన ఒకటి రెండు రోజుల్లోనే ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది