రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఆభయ హస్తం దరఖాస్తులు స్వీకరించింది. ఆభయ హస్తం దరఖాస్తు వివరాలను సిస్టంలో ఎంట్రీ చేస్తున్నారు. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రజాపాలన సబ్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారులు పాల్గొన్నారు. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులపై చర్చించారు.
ఈ దరఖాస్తులకు సంబంధించి డేటా ఎంట్రీ ఎక్కడి వరకు వచ్చింది. ఎప్పుడు పూర్తవుతుందని అధికారులను భట్టి ప్రశ్నించారు. డేటా ఎంట్రీ దాదాపు పూర్తయిందని అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి నాటికి ఏకంగా కోటి దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి చేసినట్లు వివరించారు. మిగిలిన ఐదారు లక్షల అప్లికేషన్ల సమాచారాన్ని శనివారం, ఆదివారంలోపే పూర్తి చేస్తామని చెప్పారు.
గ్యారెంటీల వారిగా ఎన్ని అభ్యర్థనలు వచ్చేయో చర్చించారు. ముఖ్యంగా రేషన్ కార్డు, ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్త ఉండలని భట్టి సూచించారు. ప్రజా పాలన దరఖాస్తు డేటా సేకరణలో కానీ, ఎంట్రీలో కానీ ఎవరు కూడా దరఖాస్తుదారుని ఓటీపీ అడగలేదని ఆయన స్పష్టం చేశారు.
ఓటీపీ అనే అంశం దరఖాస్తులోనే లేదని.. ఎవరైనా సైబర్ నేరస్తులు ఫోన్ చేసి దరఖాస్తుదారులను ఓటీపీ అడిగితే ఇవ్వొద్దని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. త్వరలోనే గృహజ్యోతి గ్యారంటీని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే డిస్కంల నుంచి రాష్ట్రంలో గృహ విద్యుత్ వినియోగం ఏ మేరకు ఉందనే వివరాలు ప్రభుత్వం సేకరిస్తోంది. 200 యూనిట్లలోపు ఇస్తే ప్రభుత్వం నుంచి డిస్కంలకు నెలకు ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందనే దానిపై కూడా చర్చించారు.
అంతే కాకుండా రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా వచ్చే నెల నుంచే అమలు చేయాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆరు గ్యారెంటీల్లో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంచారు. అయితే మిగతా గ్యారెంటీలకైనా అర్హతలు నిర్ణయించాలని డిమాండ్లు ఉన్నాయి. చాలా మంది ఐటీ చెల్లించే ఉద్యోగులు కూడా రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారు. ఇళ్లకు అప్లై చేసుకున్నారు. అలాగే 10 ఎకరాలకు పైన ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకున్నారు.