TELANGANA

అన్నదాతలకు శుభవార్త.. ఒకేసారి రూ.2 లక్షల రైతు రుణ మాఫీ..!

తెలంగాణలో అధికారంలోకి రాగానే రూ.2 లక్ష రైతు రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించింది. దీంతో అన్నదాతల రుణాలు మాఫీ చేయడంపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. అన్నదాతలపై వడ్డీ భారం లేకుండా రుణ మాఫీ చేయాలనీ యోచిస్తోంది. రైతు రుణ మాఫీ ఒకేసారి చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పలు దఫాలుగా రుణ మాపీ చేసినా.. అందరు రైతులకు రుణ మాఫీ కాలేదు.

 

దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి చేస్తే ఎలా ఉంటుందని అధికారులను అడిగి తెలుసుకోటోంది. 2003 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి రుణ మాఫీ చేసింది. ఇప్పుడు కూడా అదే పద్ధతి పాటించాలని హస్తం పార్టీ భావిస్తోంది. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఒకేసారి సాధ్యం కాకుంటే రెండు విడతల్లో రుణ మాఫీ చేయాలని యోచిస్తోంది. రైతు రుణ మాఫీకి సంబంధించి రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో రాష్ట్ర సర్కార్ చర్చలు జరుపుతోంది.

 

 

రైతులకు రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు దాదాపు రూ.25 వేల కోట్ల నుంచి 28 వేల కోట్ల మేర ఉంటాయని ఒక అంచనాకు వచ్చారు. ఇందులో రూ.లక్ష వరకు ఉన్న పంట రుణాలే 80 శాతం ఉన్నట్లు సమాచారం. దఫా, దఫాలుగా రుణ మాఫీ చేస్తే రైతలుపై వడ్డీ భారం పడే అవకాశం ఉందని.. అందుకే ఒకేసారి లేకుంటే రెండు విడతల్లో అన్నదాతల రుణాలు మాఫీ చేయాలని సర్కార్ భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కొందరి రైతుల రుణాలు మాఫీ చేసినా.. పలు విడుతల్లో చేయడంతో వడ్డీ భారం పడింది.

 

ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రుణ మాఫీ చేయడం కష్టంగా మారింది. అందుకే ప్రభుత్వం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసే యోచనలో ఉంది.ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మాదిరి రైతు సాధికార సంస్థలా ఒక కార్పొరేషన్‌‌ను ఏర్పాటు చేశారు. దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి రైతుల రుణాలను మాఫీ చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్‌‌కు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి.. ఒకేసారి రూ.20 వేల కోట్లను బ్యాంకు ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బ్యాంకు వద్ద తీసుకున్న రుణాలకు ప్రభుత్వం ప్రతి నెలా లేదా ప్రతి సంవత్సరం కొంత మొత్తం చెల్లించనుంది.