AP

రెబెల్ ఎంపీ రఘురామకు మరో షాక్..

ఏపీలో సంక్రాంతి వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటివరకు ఢిల్లీ హైదరాబాద్ కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తూ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. గతంలో రఘురామ కృష్ణం రాజును ఏపీ పోలీసులు సైతం అరెస్టు చేసి విచారణ చేసిన సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతి సందర్భంగా తన సొంతూరికి రావాలని భావిస్తున్న రఘురామ కృష్ణంరాజుపై ఏపీ పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం. తనను ఓ అట్రాసిటీ కేసులో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

 

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఈ సంక్రాంతి వేళ కష్టాలు తప్పేలా లేవు. గతంలో అరెస్టయి ఆ పై బెయిల్‌పై విడుదలైన రఘురామరాజు తన మకాంను ఢిల్లీకి మార్చారు. అప్పుడప్పుడు హైదరాబాదులో ప్రత్యక్షమవుతున్నప్పటికీ ఎక్కువ సమయం ఢిల్లీలోనే తాను గడుపుతున్నారు. ఇదే సమయంలో రచ్చబండ పేరుతో ఏపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా రఘురామపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఆయనపై ఏపీ పోలీసులు పలు కేసులు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు. ఆ సమయంలో తనను విచారణ చేశారు. అయితే ఏపీ పోలీసులు తనపై దురుసుగా ప్రవర్తించారని తనపై దాడి చేశారని రఘురామ ఆరోపించారు. తాను రాష్ట్రానికి రాలేని పరిస్థితులు ఉన్నాయంటూ అందుకే నియోజకవర్గానికి దూరమయ్యానంటూ అధికార వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఇక చివరిసారిగా తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజున కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

 

తాజాగా రఘు రామకృష్ణం రాజు సంక్రాంతి సందర్భంగా తన సొంతూరుకు వెళ్లాలని,ఇందుకు తనకు రక్షణ కల్పించాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణ చేసిన ధర్మాసనం రఘురామకృష్ణం రాజుకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. అంతేకాదు 41A ప్రొసీజర్ పాటిస్తూ రక్షణ కల్పించాలని పేర్కొంది. ఇదిలా ఉంటే రఘురామ కృష్ణంరాజుపై నమోదైన మరో కేసులో పోలీసులు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రఘురామపై అనంతపురంలో అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో తనను అదుపులోకి తీసుకుని విచారణ చేసేందుకు పోలీసులు తయారవుతున్నారు.

 

ఇప్పటికే టీడీపీ-జనసేనల నుంచి టికెట్ ఆశించిన రఘురామకు, ఆ పార్టీలేవి టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా లేవనే ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీ నుంచి పోటీచేయాలని భావిస్తున్న రఘురామకు అక్కడ కూడా నిరాశే ఎదురైందనే వార్త రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. షాకుల మీద షాకులు తగులుతున్న రఘురామ కృష్ణం రాజు అరెస్టుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారన్న నేపథ్యంలో ఈ రెబెల్ ఎంపీ ఏపీలో అడుగుపెడతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.