అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరో కీలక నేత గుడ్‌బై చెప్పారు. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి వైయస్సార్సీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపినట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు. తనకు రెండోసారి పోటీకి వైసీపీ అవకాశం ఇవ్వడం లేదన్న సమాచారంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని అసంతృప్తితో ఉన్న బాలశౌరి గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎంపీ బాలశౌరికి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ కు మధ్య ఉన్న విభేదాలు కూడా పార్టీని వీడడానికి కారణంగా తెలుస్తోంది. కాగా, రానున్న రెండు రోజుల్లో బాలశౌరి.. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీ లేదా అవనిగడ్డ, పొన్నూరు అసెంబ్లీ టికెట్ బాలశౌరి ఆశిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే ‘పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ లో చేరాలని నిర్ణయించుకున్నాను’ ఎంపీ బాలశౌరి ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. దీంతో జనసేన నాయకులు, కార్యకర్తలు ఆయనకు వెల్కమ్ సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, త్వరలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో అసంతృప్తితో ఉన్న రాజకీయ నాయకులు భారీ సంఖ్యలోనే పార్టీలు మారుతున్నారు. ఇది ఇలావుండగా, విజయవాడ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పార్టీనికి వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా తన అభిమానులు, కార్యకర్తలతో భవకుమార్ చర్చించారు. పార్టీ వీడొద్దంటూ తనపై వైఎస్సార్సీపీ అధిష్టానం నుంచీ తీవ్ర ఒత్తిడి ఉందని తెలిపారు. అయితే, భవ కుమార్ వీడేందుకు ఆయన సిద్ధమయినట్లు తెలుస్తుంది.
గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా భవకుమార్ పోటీ చేసి ఓడిపోయారు. 2019 నుంచీ వైఎస్సార్సీపీ విజయవాడ నగర అధ్యక్షుడుగా భవకుమార్ కొనసాగుతున్నారు. పార్టీ వీడొద్దంటూ ఆయన వద్దకు దేవినేని అవినాష్, ఇతర వైఎస్సార్సీపీ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే, తెలుగుదేశం నేతలతోనూ సంప్రదింపుల్లో ఉన్నానని భవకుమార్ తెలిపారు. కార్యకర్తలు, తన శ్రేయోభిలాషులతో మాట్లాడి త్వరలో తన నిర్ణయం చెబుతానని స్పష్టం చేశారు.