AP

టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఖరార్..డజను హామీలు

సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలు లోక్‌సభ/అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్‌‌ఛార్జీలను ప్రకటిస్తూ దూకుడు మీద ఉంది.

 

పలు అంశాలు..

 

సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం- జనసేన పార్టీలు సాగిస్తోన్న కసరత్తు కూడా దాదాపుగా ముగింపుదశకు చేరుకుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాతే ఈ జాబితాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. దీనికి సమాంతరంగా- ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ఈ రెండు పార్టీలు ఖరారు చేశాయి.

ఉమ్మడి మేనిఫెస్టో..

 

ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన హామీలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ శుక్రవారం రాత్రి సమావేశం అయ్యారు. చంద్రబాబు ఉండవల్లి నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, కొందరు సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

 

12 అంశాలు..

 

సుమారు నాలుగు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై టీడీపీ- జనసేనే అగ్ర నాయకత్వం మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మొత్తంగా 12 అంశాలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోకు తుది రూపాన్ని ఇచ్చారు. వీలైనంత త్వరగా దీన్ని జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

 

టీడీపీ గ్యారంటీలు..

 

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించిన విషయం తెలిసిందే. తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలను తల్లుల అకౌంట్‌లో జమ చేయడం, మహిళలందరికీ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేస్తామని వెల్లడించింది.

 

నాటి హామీలే..

 

దీపం పథకం కింద ప్రతి కుటుంబానికీ ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా మంజూరు చేయడం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలను అందించడం, అన్నదాత పథకం కింద రైతులందరికీ ఏడాదికి 20,000 రూపాయలను అందిస్తామని టీడీపీ గతంలో ప్రకటించింది.

 

సూపర్ సిక్స్..

 

అలాగే- యువగళం కింద ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయల ఆర్థిక సాయం, ఇంటింటికీ కుళాయి ద్వారా మంచినీటిని సరఫరా చేస్తామంటూ ఇదివరకే ప్రకటించింది టీడీపీ. వాటన్నింటినీ కూడా ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చారు. వీటికి సూపర్ సిక్స్‌‌‌గా నామకరణం చేశారు.

 

వారాహి వాగ్దానాలు..

 

ఇదివరకే వారాహి విజయయాత్ర సందర్భంగా పవన్ కల్యాణ్ కొన్ని హామీలను ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు చెబుతున్నారు. టీడీపీ, జనసేన ఆరు చొప్పున హామీలతో కూడిన ఉమ్మడి మేనిఫెస్టోతో ఈ ఎన్నికలను ఎదుర్కొనాలని తీర్మానించినట్లు తెలుస్తోంది.