AP

మొన్న పీకే.. నిన్న షర్మిల.. అసలేం జరుగుతోంది?

అటు జగన్ సైతం చంద్రబాబుకు మించి వ్యూహాలు పన్నుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. సామాజిక సమీకరణలను తెరపైకి తెస్తూ టిడిపి, జనసేనలకు సవాల్ విసురుతున్నారు. ఆ రెండు పార్టీలను డైలమాలో పెడుతున్నారు. అయితే చంద్రబాబు దీనికి కౌంటర్ అటాక్ చేయడం ప్రారంభించారు. గత కొద్దిరోజులుగా తనకు టచ్ లో ఉన్న ప్రశాంత్ కిషోర్ ను ఏకంగా తన ఇంటికి రప్పించారు. గత ఎన్నికల్లో వ్యూహాలతో వైసిపికి విజయం చేకూర్చిన ప్రశాంత్ కిషోర్ ను తన వైపు తిప్పుకొని.. జగన్ కు చంద్రబాబు గట్టి సవాల్ చేశారు.

 

అయితే పవర్ షేరింగ్ విషయంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలను డైవర్ట్ చేయడానికే చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ ను తెప్పించుకున్నారని వైసిపి కామెంట్ చేస్తోంది. మొన్నటి వరకు బందిపోటు నాయకుడు అంటూ కామెంట్ చేసిన చంద్రబాబు.. అదే ప్రశాంత్ కిషోర్ ను ఆశ్రయించడంపై సొంత పార్టీ శ్రేణుల్లో కూడా విస్మయం వ్యక్తం అవుతోంది. అయితే జగన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు ఈ చర్యకు దిగారని టిడిపి శ్రేణులు సమర్ధించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు నాకు పీకే వ్యూహాలు అక్కరకు వస్తాయని ఎక్కువమంది భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఇష్యూ మరవకముందే తెరపైకి షర్మిల వ్యవహారం రావడం.. చంద్రబాబు వ్యూహంలో భాగమేనని తేలుతోంది.

 

చంద్రబాబు వైసీపీ పై గేమ్ ప్రారంభించారని.. అందులో భాగమే పీకే అని.. తరువాత షర్మిల వచ్చారని.. ఇక నెక్స్ట్ ఎవరు? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా నారా కుటుంబానికి షర్మిల క్రిస్మస్ గిఫ్ట్స్ పంపడం సంచలనమే. సినీ రాజకీయ కుటుంబాలకు షర్మిల గిఫ్ట్స్ పంపినా.. తమకు చిరకాల ప్రత్యర్థి అయిన నారా ఫ్యామిలీకి బహుమతులు పంపడం అనేది రాజకీయ చర్చకు కారణమైంది. 2019 ఎన్నికల్లో బై బై చంద్రబాబు అన్న నినాదం షర్మిలది. అటువంటి షర్మిల ఇప్పుడు అదే కుటుంబానికి గిఫ్ట్స్ పంపడం.. సోషల్ మీడియాలో ఆమెకు లోకేష్ శుభాకాంక్షలు తెలపడం.. టిడిపి మైండ్ గేమ్ లో భాగమేనని తెలుస్తోంది. జగన్ ను వ్యక్తిగతంగా, రాజకీయంగా విభేదించే వారిని, వ్యతిరేకులను కూడగట్టి ఎన్నికల్లో లబ్ది పొందాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గత ఎన్నికల ముందు జగన్ అనుసరించిన ఫార్ములానే.. ఇప్పుడు చంద్రబాబు అదే జగన్ పై అమలు చేస్తున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి