AP

జనసేన ఆషామాషి కాదు..

ఉమ్మడి ఏపీని సుదీర్ఘకాలం పాలించిన వ్యక్తిగా చంద్రబాబు కు గుర్తింపు లభించింది. ఆయన పూర్వాశ్రమం సైతం కాంగ్రెస్ పార్టీయే. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ పూర్వాశ్రమం కూడా కాంగ్రెస్ పార్టీయే. కెసిఆర్ తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగే వారు. ఈ లెక్కన తెలంగాణ, ఏపీకి పాలించిన సీఎంలలో ముగ్గురుని అందించింది కాంగ్రెస్ పార్టీయే. అలాగని వారు చెప్పుకోవడం లేదే. పార్టీలు అన్నాక నాయకులు తయారవుతారు. వారి ప్రయోజనాలకు అనుగుణంగా పార్టీలు మారుతారు. దానిని మన గొప్పతనంగా చెప్పుకోవడం మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలకే చెల్లింది.

 

అయితే ఈ లెక్కన జనసేన కూడా ఎంతోమంది నాయకులను తయారుచేసింది. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ జనసేన నేతే. గతంలో జనసేన తరఫున పోటీ చేశారు. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో కూడా యాక్టివ్ గా పని చేశారు. ఆ మధ్యన కొత్త పార్టీ పెట్టిన రామచంద్ర యాదవ్ సైతం పూర్వాశ్రమంలో జనసేనలో పనిచేసిన వాడే. గత ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పోటీ చేశారు. ఎన్నికల అనంతరం సొంత పార్టీని పెట్టుకున్నారు. ఈ మధ్యనే సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. ఈయన సైతం పూర్వాశ్రమంలో జనసేనలో పనిచేసిన వారే. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. ఎన్నికల అనంతరం పార్టీని వీడారు. ఇప్పుడు సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ లెక్కన జనసేన కూడా అంత ఆషామాషీ కాదు. పార్టీ ఏర్పాటు చేసి సుదీర్ఘకాలం అవుతున్నా.. అధికారంలోకి రాకున్నా ఎంతోమంది నేతలను జాతికి అందించిన ఘనత మాత్రం ఆ పార్టీకి దక్కుతుంది.