TELANGANA

రేవంత్ కు తొలి పరీక్ష…

అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వని హామీలు అంటూ ఏమి లేవు. ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. వారి అభిమానాన్ని పొందగలిగారు. తెలంగాణలో అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎలా ముందుకెళ్తారో నన్న ఆందోళన కనిపిస్తోంది. ఈ పథకాలను అమలు చేయడం ఒక ఎత్తు అయితే అభివృద్ధిని కొనసాగించడం కూడా ఒక ఎత్తు. సంక్షేమ పథకాల ఖర్చు ఒక ఎత్తు అయితే.. పడిపోతున్న ఆదాయాన్ని నిలబెట్టడం కూడా కాంగ్రెస్ పార్టీపై ఉంది.

 

మరోవైపు కొత్త సంవత్సరం సమీపిస్తోంది. కొత్త యాడాదితో పెంచిన పింఛన్లు అమలు చేస్తారా? లేదా? అని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం పింఛన్ల పెంపు పధకమే. మరోవైపు ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణ పథకం సంస్థ పై పెను భారాన్ని మోపింది. పెద్ద ఎత్తున నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. అందుకే ఆర్టీసీకి నిధులు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మరోవైపు రైతు బంధు పథకం నిధులు కూడా సక్రమంగా జమ కావడం లేదు. గత ప్రభుత్వం 7700 కోట్ల రూపాయలు జమ చేసినట్లు చెబుతోంది. కానీ అవి ఇప్పుడు రైతులకు ఖాతాలోకి సక్రమంగా వెళ్లడం లేదు. ఇలా చాలావరకు పథకాలు ప్రారంభంలోనే రేవంత్ రెడ్డికి పరీక్షగా మారాయి. వాటిని అధిగమించాల్సిన అవసరం ఆయనపై ఉంది.

 

తెలంగాణలో ఇప్పటికే ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వివిధ పథకాలను అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కత్తి మీద సామే. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటే పెద్ద మొత్తంలో నిధులు అవసరం. హామీలను అమలు చేస్తూ.. రాష్ట్రం అప్పుల్లో ఊరుకు పోకుండా చూడడమనేది రేవంత్ రెడ్డికి సవాలే. 2023- 24 చివరి నాటికి తెలంగాణ అప్పులు జి ఎస్డిపిలో 23.8% గా ఉండనున్నాయి. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుకు రూ.1.29 లక్షల కోట్లు అవసరమనేది ఒక అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో హామీల అమలుకు నగదు సర్దుబాటు చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం కిందా మీదా పడింది. 2023-2024 లో తెలంగాణ ప్రభుత్వం రూ.38,234 కోట్లు అప్పులు తెచ్చుకునే వీలుండగా.. ఇంకా ఆరు నెలల వ్యవధి ఉండగానే ఈ ఏడాది అక్టోబర్ నాటికే రూ. 33, 378 కోట్ల మేర అప్పులు తెచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే తెలంగాణ అప్పులతో పోల్చుకుంటే ఆదాయం తగ్గుముఖం పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది