APNationalTELANGANA

తెలంగాణలోని ఈ ఆలయంలో గాంధీజీ పాలరాతి విగ్రహం…

నేడు మహాత్మాగాంధీ పుట్టినరోజు…మన దేశానికి స్వేచ్ఛావాయుువులను అందించడానికి జాతిపతి మహాత్మ గాంధీ కీలక పాత్ర పోషించాడు. భారతదేశంలో చాలామంది గాంధీజీని దేవునిగా కొలుస్తారు.

అంతేకాకుండా, దేశంలో ఏకంగా ఆయనకు ప్రత్యేకించి దేవాలయాలు కూడా ఉన్నాయి. అయితే, దేశంలో గాంధీజీ ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ, తెలంగాణలో ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రత్యేకం. ఈ ఆలయంలోని గాంధీజీ విగ్రహం పాలరాతితో నిర్మించారు. రండి. ఈ సందర్భంగా కోరిన కోర్కెలు తీర్చే గాంధీ ఆలయం గురించి గాంధీ జయంతి నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పెద్దకామర్తి గ్రామంలో..:ఈ ఆలయం తెలంగాణాలో ఉంది. గాంధీజికి ప్రత్యేకంగా ఓ ఆలయమంటూ ఉందని, అది కూడా తెలంగాణలో ఉందని చాలామందికి తెలియదు. ఎందుకంటే, ఈ ఆలయం అంత ప్రాచుర్యం పొందలేదు. కానీ, రోజు రోజుకీ ఈ గాంధీ ఆలయాన్ని సందర్శించడం భక్తులకు సెంటిమెంట్‌గా మారుతూ వస్తోంది. ఈ ఆలయం హైదరాబాద్-విజయవాడ హైవేకి సమీపంలో నాలుగు ఎకరాల స్థలంలో నిర్మించబడింది. హైదరాబాద్ నుంచి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిట్యాల్ పట్టణంలోని పెద్దకామర్తి గ్రామంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. చుట్టపక్కల గ్రామస్తులంతా ప్రతిరోజూ ఈ ఆలయాన్ని సందర్శించేందుకు వస్తారు. ఈ ఆలయం ఒక ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తోంది. ఆ ఛారిటబుల్ ట్రస్టు కార్యదర్శి పేరు పివి కృష్ణారావు. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు రోజుకు సుమారు 350 మంది భక్తులు తరచుగా వస్తూ ఉంటారట..

పట్టు వస్త్రాలు అందిస్తారు..:ఈ ఆలయం ప్రాంగణంలో ఒక కల్యాణ మండపం కూడా ఉంది. మద్యం, మాంసం, ఇతర అసాంఘీక కార్యకలాపాలకు ఇక్కడ తావులేదు. ఇక్కడ మద్యం, మాంసం తినడం నిషేధమన్న నిబంధనలతో పెళ్లిళ్లకు అనుమతినిస్తుంది ఆలయ ట్రస్ట్. కులాంతర వివాహాలు చేసుకునే వారికి తక్కువ ధరకే కల్యాణ మండపాన్ని అద్దెకిస్తుంది. ఈ గ్రామంలోని ఇళ్లలో పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు ఎవైనా జరిగితే ఆ జంటలకు పెళ్లి బట్టు, పట్టు వస్త్రాలను అందించడం ప్రారంభించింది ఆలయ ట్రస్ట్. పెళ్లి ఇంటి వారు పెళ్లి పత్రికలు పంచే ముందు ఈ ఆలయంలో పూజలు చేసి గాంధీజీ ఆశ్వీరాదాలు తీసుకోవడం ఈ గ్రామస్థుల ఆచారం. ఈ గ్రామంలో ఉండేవారంతా గాంధీజీని దేవునిలా చూస్తారు. అందుకే ఆయనకు నితన్యం పూజలు చేస్తుంటారు.

పాలరాతి విగ్రహం..:2012లో మహాత్మాగాంధీ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ గుడికి భూమి పూజ చేశారు. అనంతరం 2014 సెప్టెంబర్‌లో ఈ ఆలయంలో మహాత్మగాంధీ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ ఆలయంలో ప్రతియేటా రెండుసందర్భాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఒకటి ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. రెండోది అక్టోబర్ 2 మహాత్మగాంధీ పుట్టినరోజు సందర్భంగా.. ఇప్పటికీ ఈ పూజలు ఇలా నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. సమీపంలోని గ్రామస్థులు కొంతమంది ప్రతిరోజూ వచ్చి నిత్యం కుటుంబసభ్యులతో కలిసి ప్రార్థనలు చేసుకుంటారు. ఈ ఆలయంలో మహాత్ముడు కూర్చున్న భంగిమలో భక్తులకు ఆశీస్సులు అందజేస్తూ దర్శనమిస్తాడు. తెలంగాణ పర్యాటక శాఖ ఈ ఆలయాన్ని రాష్ట్రంలోని దివ్య గమ్యస్థానాలలో ఒకటిగా చేర్చింది.