AP

వైఎస్ జగన్‌తో ఢీ అంటున్న షర్మిల.. మరి విజయమ్మ తన కూతురు వైపేనా?

రాజకీయాలు అంటే అలాగే ఉంటాయి. సొంత వాళ్లు, నా వాళ్లు, నీ వాళ్లు అంటూ ఎవరూ ఉండరు ఇక్కడ. అందుకే రాజకీయాల్లో మనవాళ్లు ఎవ్వరూ ఉండరు.

అవసరానికి మాత్రమే మనవాళ్లు. లేకపోతే శత్రువులే అంటారు. అది ప్రస్తుతం తూచాతప్పకుండా జరుగుతున్నట్టు అనిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడుపులో పుట్టిన ఇద్దరు వైఎస్ జగన్, షర్మిల ఉద్దండులే. వైఎస్సార్ వారసత్వాన్ని ఇద్దరూ పుణికిపుచ్చుకున్నారు. అందుకే ఇద్దరూ రాజకీయాల్లో రాణించాలని.. తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు.

వైఎస్సార్ వారసుడిగా ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో జగన్.. ఏపీలో పార్టీ పెట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కొన్నేళ్ల పాటు తన అన్న జగన్ కు మద్దతు ఇచ్చిన వైఎస్ షర్మిల ఆ తర్వాత వైఎస్సార్సీపీ పార్టీకి దూరమయ్యారు. కొన్నేళ్లు రాజకీయాలకే దూరం అయ్యారు. ఆ తర్వాత చాలా ఏళ్లకు తెలంగాణలో ప్రత్యక్షం అయ్యారు. అన్నకు వ్యతిరేకంగా ఏపీలో రాజకీయాలు చేయలేక చివరకు తెలంగాణను నమ్ముకొని తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా అని తెలంగాణ ప్రజలకు చెప్పుకొచ్చారు. కానీ.. తెలంగాణ ప్రజలు షర్మిల మాటలను నమ్మలేదు. అసలు ఆమె గురించి పట్టించుకోవడమే మానేశారు. ఇన్నాళ్లకు తెలంగాణ గుర్తొచ్చిందా? పోపోవమ్మ అన్నట్టుగానే ప్రవర్తించారు.

 

ఇక తెలంగాణలో వర్కవుట్ కాదని షర్మిల భావించి మళ్లీ ఏపీ రాజకీయాల మీదనే ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం వైఎస్సార్టీపీ పార్టీ నడిచే పరిస్థితులు లేవు. అందుకే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు కూడా ఆమె వెనుకాడటం లేదు. ఇంకో మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి. అసలు పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థులు కూడా లేరు. అందుకే కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. కానీ.. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం తనను ఏపీలో వాడుకోవాలని చూస్తోంది. అన్న జగన్ కు పోటీగా ఏపీలో బరిలోకి దించబోతోంది హైకమాండ్. అంటే.. ఏపీలో వైఎస్సార్సీపీ పార్టీతో షర్మిల ఢీకొట్టబోతున్నారన్నమాట. మరి.. ఈ సమయంలో వైఎస్ విజయమ్మ ఎటువైపు ఉంటారు అనే దానిపై స్పష్టత లేదు. అటు చూస్తే కొడుకు.. ఇటు చూస్తే కూతురు. మరి విజయమ్మ ఎవరివైపు ఉంటారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.