ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ప్రతీ సీటును ప్రతీ పార్టీ కీలకంగా భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన అధికార వైసీపీ కూడా ఈసారి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెల్చుకోవాలనే లక్ష్యంతో చాలా చోట్ల ఇన్ ఛార్జ్ లను మార్చేస్తోంది. అటు వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన విపక్ష టీడీపీ-జనసేన సైతం సీట్ల పంపకాలు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందన్న దానిపై పలు అంచనాలు వెలువడుతున్నాయి.
ఇదే క్రమంలో తాజాగా జనసేనలో చేరిన టాలీవుడ్ కమెడియన్ పృధ్వీరాజ్ ఇవాళ అమలాపురంలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన గెలిచే సీట్లను ఆయన చెప్పేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీలు గెలిచే సీట్లపై తన అంచనాల్ని ఇవాళ వెల్లడించారు. అయితే సహజంగానే టీడీపీ-జనసేన కూటమికి అనుకూలంగానే ఆయన రిపోర్టు ఉన్నా సీట్ల సంఖ్య మాత్రం కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది.
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కేవలం 17 సీట్లు మాత్రమే వస్తాయని ముందుగా కమెడియన్ పృధ్వీ వెల్లడించారు. గతంలో వైసీపీలో పనిచేసిన ఆయన.. ఇప్పుడు ఆ పార్టీని టార్గెట్ చేస్తూ సెటైర్లు కూడా వేస్తున్నారు. అదే సమయంలో విపక్ష టీడీపీ-జనసేన కూటమి 136 అసెంబ్లీ సీట్లను, 21 ఎంపీ సీట్లను కూడా గెల్చుకుంటుందని పృధ్వీ అంచనా వేస్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికల తర్వాత సంక్రాంతికి గంగిరెద్దులతో పాటు మంత్రి అంబటి రాంబాబును కూడా డాన్స్ ల కోసం పిలవొచ్చని పృధ్వీ సలహా ఇచ్చారు.