National

భారత్ జోడో న్యాయ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహర్‌ జిల్లాలోకి గురువారం న్యాయ్ యాత్ర ప్రవేశించింది. ముందుగా అనుకున్న రూట్ మ్యాప్ ప్రకారం కాకుండా బెంగాల్ లోని ఉత్తరాది జిల్లాల నుంచి బీహార్‌లోకి ప్రవేశించేలా రూట్ ఛేంజ్ చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలే ఇందుకు కారణమని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

 

తాజాగా జేడీయూ (JDU) అధ్యక్షుడు, బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ కూడా బీజేపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు రెండు రోజులు బ్రేక్ తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కూచ్‌బెహర్‌‌లో రోడ్ షో నిర్వహించిన అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర తిరిగి జనవరి 28 న ప్రారంభమవుతుందని కాంగ్రెస్ తెలిపింది.

 

ఇండియా(INDIA) కూటమి నుంచి ప్రతిపక్ష పార్టీ నేతలు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. తృణముల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో సోలో గానే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించాయి. ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన నీతీశ్‌ కుమార్‌ తిరిగి బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ, జేడీయూ నేతలు ఒకే విమానంలో పట్నా నుంచి ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. దీంతో కూటమిని నీతీశ్‌ కుమార్ వీడితే మిగిలిన పార్టీలతో కలిసి అనుసరించాల్సిన కార్యాచరణ, వ్యూహాలపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించేందుకు రాహుల్‌ ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.