AP

వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా ప్రకటన వాయిదా ! కారణమిదేనా..?

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే ఒకరు ఇవాళ రాజీనామా ప్రకటనకు సిద్దమయ్యారు. ఆయన అనుచరులతో భేటీ అయి ఈ ప్రకటన చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. చివరి నిమిషంలో ఏమైందో ఏమో కానీ ప్రెస్ మీట్ పెట్టినా రాజీనామా ప్రకటన తప్ప మిగతా అన్నీ చెప్పారు. దీంతో అసలేం జరిగిందన్న చర్చ ఇప్పుడు అందరిలోనూ జరుగుతోంది.

 

వైసీపీలో అతి కొద్ది కమ్మ సామాజిక ఎమ్మెల్యేల్లో ఒకరైన మైలవరం నేత వసంత కృష్ణప్రసాద్ కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. తన సామాజిక వర్గానికే చెందిన చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు చేయమని అధిష్టానం పలుమార్లు సూచించినా ఆయన అలా చేయలేదు. దీంతో వసంతను పార్టీ అనుమానించడం మొదలుపెట్టింది. కానీ తాను విమర్శలకు వ్యతిరేకమని చెప్తే తనను అనుమానించడం ఏంటని అవమానంగా భావించిన వసంత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.

కానీ చివరి నిమిషంలో ఆ ప్రకటన వాయిదా వేసుకుని మిగతా విమర్శలన్నీ యథాతథంగా చేసేశారు. ప్రజలకు సేవ చేయలేనప్పుడు తానెందుకు ఎమ్మెల్యేగా ఉండాలని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలుగా ఉండీ ఏం చేయలేని పరిస్ధితుల్లో ఉన్నామని తెలిపారు. వైసీపీ అధిష్టానికి కక్షసాధింపులు వద్దు, వైఎస్ లా పాలించాలంటూ హితవు పలికారు. చంద్రబాబు, లోకేష్ ను తిట్టని నిన్ను ఎలా నమ్మాలని స్వయంగా జగనే ప్రశ్నించారన్నారు. విపక్ష నేతల్ని తిట్టని వాళ్లకు టికెట్లు ఇవ్వనని చెప్పేశారన్నారు.

 

కానీ తాను మాత్రం హుందాగానే రాజకీయం చేస్తానని వసంత కృష్ణప్రసాద్ తేల్చిచెప్పేశారు. మనసు గాయపడినప్పుడు నిలువెత్తు బంగారం ఇస్తామన్నా ఉండలేం అన్నారు. అయితే పెద్దిరెడ్డి కాల్ చేసి తొందర పడొద్దని చెప్పారని వసంత వెల్లడించారు. రాజకీయాలు వదిలేసి వ్యాపారాలు చేసుకుందామని అనుకున్నానని, కానీ శ్రేయోభిలాషులు రాజకీయాల్లోనే ఉండమంటున్నారన్నారు. దీంతో తాను త్వరలో దీనిపై క్లారిటీ ఇస్తానన్నారు.