AP

జగన్ ఎన్నికల వరాలు – ప్రధాన ఓట్ బ్యాంక్ పై గురి, ఆపరేషన్ అపోజీషన్..!!..

ఏపీలో సీఎం జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. సిద్దం సభల ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించారు. చంద్రబాబు తో అందరూ ఓడాల్సిందేనని నినదించారు. ప్రతీ సీటు గెలవాల్సిందేనని పిలుపునిచ్చారు. తాము అమలు చేసిన సంక్షేమం – సామాజిక న్యాయం తమను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో కొత్త వరాల పైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కొత్త బడ్జెట్ ప్రతిపాదన వేళ వీటిని ఖరారు చేసే అవకాశం ఉంది.

 

జగన్ కొత్త వ్యూహాలు ముఖ్యమంత్రి జగన్ బహుముఖ వ్యూహంతో ఎన్నికల యుద్దంలోకి దిగారు. రాష్ట్రంలోని 83 శాతం ప్రజలకు తాను అమలు చేసిన సంక్షేమం అందుతోందని జగన్ స్పష్టం చేసారు. ప్రతీ ఇంటికి మంచి జరిగితేనే తనకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షానికి ఓటు వేయటం అంటే సంక్షేమ పథకాల రద్దుకు ఓటు వేసినట్లేనని జగన్ అప్రమత్తం చేసారు. తాము చేసిన మంచితో ప్రజల ఆదరణ ఉందని..ప్రతీ సీటు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేసారు. ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ఏ గ్రామంలో అయినా వైఎస్సార్సీపీ మార్క్ కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు తన పాలనలో చేసిన ఏ ఒక్క కార్యక్రమం చెప్పుకోవటానికి లేదని ఎద్దేవా చేస్తున్నారు. సంక్షేమం తో పాటుగా సామాజిక న్యాయం గురించి వివరిస్తున్నారు.

 

ప్రతిపక్షాలే లక్ష్యంగా జగన్ పాలనలో మంత్రివర్గం నుంచి క్షేత్ర స్థాయి వరకు అమలవుతున్న అందరికీ సమన్యాయం గురించి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ అభ్యర్దుల ఖరారులోనూ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. టీడీపీ, జనసేన ప్రధానంగా ఆశలు పెట్టుకున్న గోదావరి జిల్లాల్లో కొత్త సమీకరణాలను తెర మీదకు తెస్తున్నారు. ప్రధానంగా బీసీలకు సీట్ల ఖరారులో ప్రాధాన్యత ఇస్తున్నారు. సిట్టింగ్ ఎంపీల్లో ఎక్కువ మందిని మార్చారు. దాదాపు పది ఎంపీ సీట్లను బీసీలకు కేటాయించారు. గోదావరి జిల్లాల్లో మెజార్టీ ఓట్ బ్యాంక్ గా ఉన్న శెట్టి బలిజ వర్గానికి తొలి నుంచి జగన్ అనేక పదువులు కేటాయించారు. జగన్ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాల వేళ టీడీపీ సైతం తమ అభ్యర్దుల ఖరారులో పునరాలోచనలో పడింది. జనసేనకు 25 -27 సీట్లు కేటాయించటం పొత్తు పైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

 

ఎన్నికల వరాలు ఇక, ఎన్నికల్లోకి దిగే సమయంలోనే జగన్ ప్రభుత్వం కొత్త హామీలకు సిద్దమైందని పార్టీలో ప్రచారం సాగుతోంది. తాజాగా ఏలూరు సభలో జగన్ పెన్షన్ పెంపు పైన పరోక్ష సంకేతాలు ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా పెన్షన్ ను రూ 3 వేలకు పెంచారు. ఇప్పుడు రూ 4 వేల వరకు పెన్షన్ పెంచుతూ బడ్జెట్ లో ప్రతిపాదన చేసే అవకాశం ఉందని సమాచారం. అదే విధంగా రైతు రుణ మాఫీ పైన సాధ్యాసాధ్యాల పైన ఇప్పటికే కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు పీఆర్సీ కమిటీ నియమించినా..రిపోర్ట్ ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో ఉద్యోగులకు ఐఆర్ ప్రకటన దిశగా నిర్ణయం వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పైన ఇప్పటికే అధికారులు నివేదిక సిద్దం చేసారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ వేదికగా ఈ నెల 7న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఈ సమయంలో ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.