TELANGANA

సోనియా గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సుమారు గంటపాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

 

సోనియాతో భేటీ అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి మర్యాదపూర్వకంగా సోనియా గాంధీతో సమావేశమైనట్లు తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరినట్లు వెల్లడించారు. ఈ అంశంపై రాష్ట్ర పార్టీ తీర్మానం చేసినట్లు ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

 

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన, చేయబోతున్న గ్యారంటీలను సోనియాకు వివరించామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. గడిచిన రెండు నెలల్లో 15 కోట్ల జీరో టికెట్లు రికార్డయ్యాయని తెలిపారు. త్వరలోనే మరో రెండు పథకాల(రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్)ను అమలు చేయబోతున్నట్లు చెప్పామని వెల్లడించారు.

 

తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నట్లు తెలిపామన్నారు భట్టి విక్రమార్క. పథకాల అమలు తీరుపై సోనియా గాంధీ అభినందనలు తెలియజేశారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

 

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సాధించేందుకు వీలుగా ప్రయత్నిస్తున్నామని, ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాలుగా సన్నాహాలు పూర్తి చేసినట్లు సోనియాకు వివరించారు. ఈ క్రమంలోనే ప్రతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని, వాటిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని వివరించారు.