TELANGANA

అట్లుంటది బీజీపీతో.. సోషల్‌ ఇంజినీరింగ్‌తో త్రిముఖ పోరు!..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ గ్రాఫ్‌ క్రమంగా తగ్గుతూ వచ్చింది. బీఆర్‌ఎస్‌ అవినీతిపై చర్యలు తీసుకోకపోవడం, లిక్కర్‌ కేసులు సీఎం కూతురు కవితకు మినహాయింపు ఇవ్వడం, బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించడం, కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్న కిషన్‌రెడ్డిని నియమించారన్న ప్రచారం జరగడం, సీనియర్లు, కొత్తగా పార్టీలో చేరిన పెద్దనేతలు పార్టీని వీడడం తదితర పరిణామాలు బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. తెలంగాణ ఎన్నికల రేసు నుంచి బీజేపీ దాదాపు తప్పుకుందని అంతా భావించారు. ఒకటి రెండు సీట్లు గెలిస్తే అదే గొప్ప అన్న అభిప్రాయం వ్యక్తమైంది.

జవదేకర్‌ ఎంట్రీతో..

కానీ, బీజేపీ ఎక్కడా పోటీ నుంచి తప్పుకున్నట్లు, బీఆర్‌ఎస్‌తో టైఅప్‌ అయినట్లు కనిపించడం లేదు. బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి ప్రకాశ్‌ జవదేకర్‌ రాక ముందు ప్రచారం కూడా చప్పగా సాదింది. కానీ, ఆయన ఎంట్రీ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రణాళికలు రూపొందించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచే వ్యూహాలు సిద్ధం చేశారు. జాతీయస్థాయి నేతల ప్రచారానికి ప్లాన్‌ రూపొందించారు. ఎక్కడెక్కడ ఎవరెవరు ప్రచారం చేయాలి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి ఎప్పుడు రావాలి, ఎంపీలు ఎక్కడ ప్రచారం చేయాలి, కేంద్ర మంత్రులు ఎప్పుడు రంగంలోకి దిగాలి, ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, రోడ్‌షోలు చేయాలి.. ఇలా అన్నీ వ్యూహాత్మకంగా రూపొందించారు.

 

సోషల్‌ ఇంజినీరింగ్‌..

ఇక సునీల్‌ బన్సల్‌ రాకతో బీజేపీ దూకుడు పెంచింది. సామాజికవర్గాల సమీకరణ మొదలైంది. ముదిరాజ్, మున్నూరుకాపుతోపాటు అనేక బీసీ కులాలను ఏకం చేశారు. బీజేపీవైపు తిప్పుకునేలా సోషల్‌ ఇంజినీరింగ్‌ మొదలు పెట్టారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చి.. తెలంగాణలో అత్యధికంగా ఉన్న మాదిగలను బీజేపీవైపు మరల్చడంలో సక్సెస్‌ అయ్యారు. జవదేకర్‌ ప్రణాళిక, బస్సన్‌ వ్యూహాలు కలిసి ప్రచారం జోరందుకుంది. అప్పటి వరకు ద్విముఖపోరే అనుకున్న విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ త్రిముఖ పోరు ఉందనేలా ప్రచారంలో ఊపు తెచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సామాజికవర్గాలను కలిసేలా ప్లాన్‌ చేసి.. బీజేపీవైపు మరల్చారు. ఎక్కడా హంగు ఆర్భాటం లేకుండా వ్యూహాత్మకంగా చేసిన సోషల్‌ ఇంజినీరింగ్‌తో పరిస్థితి త్రిముఖ పోరుగా మారిపోయింది. ఇది ఎంతవరకు బీజేపీకి లాభిస్తుందో డిసెంబర్‌ 3న తెలుస్తుంది.