TELANGANA

ఐఏఎస్ అధికారులపై తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు సంచలన ఆరోపణలు

హైదరాబాద్: పలువురు ఐఏఎస్ అధికారులపై తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ విద్యుత్ సంస్థలకు వస్తున్న ఆదరణ చూసి..

కొంతమంది ఐఏఎస్ అధికారులు ఓర్వలేకపోతున్నారని అన్నారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు.. సంస్థ ప్రగతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు ప్రభాకర్ రావు.

అంతేగాక, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినా.. ఐఏఎస్ అధికారులు విద్యుత్ సంస్థలకు నిధులు విడుదల చేయడం లేదని తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ విధానం ఇలాగే కొనసాగితే విద్యుత్ సరఫరాలో లోపం ఏర్పడే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వంలోని కొంత మంది అధికారులు సంస్థ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని చేతులు జోడించి వేడుకున్నారు.

ఇదే విషయంలో ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదన్నారు ప్రభాకర్ రావు. ఈ విషయం చెప్పిన తర్వాత ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్ కో సీఎండీలైన తమను పదవుల నుంచి తొలగించే కుట్ర కూడా జరుగవచ్చని ఆరోపించారు. అయినా సరే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని.. తమను ఈ ఐఏఎస్ అధికారులు ఎవరూ ఉద్యోగంలోకి తీసుకోలేదన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పనితనం చూసి ఉద్యోగాలు ఇచ్చారని ప్రభాకర్ రావు తెలిపారు. సోమవారం మింట్ కాంపౌండ్‌లోని విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎండీ ప్రభాకర్ రావు ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రభాకర్ రావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది.