AP

చంద్రబాబు ఆరోగ్యంపై ఏసీబీ కోర్టులో మరో పిటిషన్..

ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టై రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్దితిపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన పెరుగుతోంది.

జైలు అధికారులు ఇస్తున్న సమాచారానికీ, ఆయన వ్యక్తిగత వైద్యులు చెప్తున్న విషయాలకీ పొంతన లేకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్య పరిస్ధితిపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇవ్వాలని కోరుతూ ఆయన లాయర్లు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

రాజమండ్రి జైల్లో వేడి, ఉక్కపోత కారణంగా చంద్రబాబుకు తాజాగా డీహైడ్రేషన్ అయినట్లు, స్కిన్ అలర్జీ వచ్చినట్లు తెలిసింది. అలాగే బరువు కూడా తగ్గారని కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ డాక్టర్లతో పరీక్షలు చేయించిన జైలు అధికారులు ఆయనకు డీహైడ్రేషన్ కాలేదని, బరువు తగ్గలేదని, పెరిగారని కూడా చెప్తున్నారు. దీంతో టీడీపీ వర్గాలు, ఆయన కుటుంబ సభ్యులు విభేదిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ప్రతిరోజూ ఆరోపణలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్లు విడుదల చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన లాయర్లు ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో వారు.. చంద్రబాబు ఆరోగ్యంపై అధికారులు తమకు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వటం లేదని ఆరోపించారు. అలాగే చంద్రబాబు ఆరోగ్యంపై తమకు ఆందోళన ఉందంటూ పిటిషన్లలో న్యాయవాదులు ప్రస్తావించారు.

తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యంపై తమకు ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని తమ పిటిషన్లో ఆయన లాయర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై రేపు విచారణ చేపడతానని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. విచారణ తర్వాత కోర్టు ఇచ్చే ఆదేశాల ఆధారంగా వీరు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు.