TELANGANA

నోటీసులపై ఈడీకి షాకిచ్చిన కవిత…

ఢిల్లీ లిక్కర్ స్కాంపై నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత షాకిచ్చారు. విచారణకు తాను హాజరు కావడం లేదంటూ ఈడీ అధికారులకు ఈ మెయిల్ పంపేశారు. దీంతో ఇప్పుడు కవిత వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఈడీ తనను విచారణకు పిలిపించడం కరెక్ట్ కాదంటూ కోర్టును ఆశ్రయించారు.

 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవిత ఇవాళ ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు ఈడీ ఆమెకు నోటీసులు జారీ చేసింది. అయితే చివరి నిమిషంలో తాను హాజరుకాలేనంటూ ఈడీకి కవిత ఈ మెయిల్ పంపారు. ఇందులో ఈడీ విచారణకు గైర్హాజరు కావడానికి గల కారణాలను ఆమె వివరించారు. సుప్రీంకోర్టులో తనపై ఈడీ విచారణ కేసు పెండింగ్ లో ఉందని గుర్తుచేశారు. దీంతో ఈడీ ఇప్పుడు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తి కరంగా మారింది.

 

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ బాటలోనే కవిత కూడా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే నాలుగు సార్లు ఈడీ నోటీసులు జారీ చేసినా కేజ్రివాల్ కూడా విచారణకు హాజరు కాలేదు. ఈడీకి ఎప్పటికప్పుడు తన వాదనతో లేఖలు రాస్తూనే ఉన్నారు. ఇప్పుడు కవిత కూడా అదే బాటను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసును సాకుగా చూపుతూ ఈడీ విచారణను ఈసారికి తప్పించుకున్న కవిత విషయంలో తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది చూడాల్సి ఉంది.