AP

చంద్రబాబు కేసుల్లో వాట్ నెక్స్ట్ – నేడే కీలకం, ఉత్కంఠ..!!.

ఏపీలో ఎన్నికల వేళ ఆసక్తికర రాజకీయం చోటు చేసుకుంటోంది. చంద్రబాబు పైన సీఐడీ నమోదు చేసిన కేసుల్లో కీలక పరిణామాలు మొదలయ్యాయి. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన సుప్రీం తీర్పు వెలువరించింది. 17ఏ పైన మాత్రం ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసారు. అరెస్ట్, రిమాండ్ విషయంలో చంద్రబాబు వాదనతో ఏకీభవించలేదు. ఈ రోజు సుప్రీంలో చంద్రబాబు ఫైబర్‌నెట్‌ తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది.

 

ఫైబర్ కేసులో తీర్పు: చంద్రబాబు స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పైన సీఐడీ సుప్రీంను ఆశ్రయించింది. దీని పైన సుప్రీం నిర్ణయం వెలువరించాల్సి ఉంది.

 

తాజాగా చంద్రబాబు స్కిల్ కేసులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో దానిని మరో ధర్మాసనానికి పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ ధర్మాసనం ముందుకు పంపాలో ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తారు. ఆ ధర్మాసనం ముందు మరోసారి వాదనలు జరగాల్సి ఉంటుంది. ఆ తర్వాత తుది నిర్ణయం వెలువడుతుంది. దీనికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది.

 

ఇబ్బందులు లేనట్లేనా: ఇటు, ఫైబర్‌నెట్‌ కేసులో బెయిల్‌ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. 17ఏ సెక్షన్‌ వర్తింపుపై పిటిషన్‌ మరో బెంచ్‌ ముందుకు వెళ్తున్నందున.. అప్పటివరకూ అరెస్టు వద్దని ఆదేశాలిస్తారా.. లేక ముందస్తు బెయిల్‌ ఇస్తారా లేక మరేదైనా ఆదేశాలు వస్తాయా అన్నది ఉత్కంఠగా మారింది.

 

ఫైబర్ నెట్ కేసులో సుప్రీం ఇవ్వబోయే తీర్పు కూడా ఉత్కంఠ పెంచుతోంది. ఈ కేసు తప్ప మిగిలిన కేసుల్లో ఇప్పటికే బెయిల్‌ వచ్చినందువల్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ చంద్రబాబు తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించడానికి ఆటంకాలు ఉండవని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటు ఎన్నికలకు చంద్రబాబు సిద్దం అవుతున్నారు. అయితే, స్కిల్ కేసులో క్వాష్ ను కోర్టు అనుమతించ లేదు.

 

సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ: కేవలం 17ఏ పైన మాత్రమే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇదే సమయంలో ఈ కేసుల తదుపరి విచారణకు సీఐడీకి ఎటువంటి ఇబ్బంది లేదని..విచారణ కొనసాగించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అటు స్కిల్ కేసులో హైకోర్లు ఇచ్చిన బెయిల్ పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఐడీ సుప్రీంను ఆశ్రయించింది.

 

దీని పైన ఇప్పటికే వాదనలు జరిగాయి. ఈ అంశం పైన సుప్రీం తీర్పు ఇవ్వాల్సి ఉంది. దీంతో..సుప్రీంలో 17ఏ అంశం పైన తీసుకొనే నిర్ణయం..సీఐడీ అడుగులు..తదుపరి విచారణ వంటి అంశాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆసక్తి కరంగా మారుతోంది.