AP

ఏపీలో జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ..?

అక్రమాస్తుల కేసుల విచారణతో జేడీ లక్ష్మీనారాయణ జాతీయ వ్యాప్తంగా సుపరిచితులయ్యారు. ముఖ్యంగా జగన్ అక్రమస్తుల కేసులను విచారణ చేపట్టింది జేడీ లక్ష్మీనారాయణే. గత ఎన్నికల ముందు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. సరిగ్గా ఎన్నికలకు 15 రోజుల ముందు జనసేనలోకి ఎంట్రీ ఇచ్చారు. విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి రెండున్నర లక్షలకు పైగా ఓట్లు సాధించారు. ఎన్నికల అనంతరం జనసేన ను వీడారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

 

రానున్న ఎన్నికల్లో విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని చాలా సందర్భాల్లో జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు.ఏదైనా రాజకీయ పార్టీ టిక్కెట్ ఇస్తే బరిలో దిగుతానని.. లేకుంటే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల వైసిపి ప్రభుత్వ చర్యలను అభినందిస్తూ వ్యాఖ్యలు చేశారు.జగన్ సర్కార్ చేపడుతున్న పనులను మెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో జేడీ లక్ష్మీనారాయణ వైసీపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అటువంటి సంకేతాలు ఏవి ఇవ్వలేదు. అలాగని పొలిటికల్ పార్టీలో అవకాశాలు లేనట్లు తెలుస్తోంది.

 

అయితే తిరిగి జనసేనలో చేరతారని ఓ టాక్ నడిచింది. అయితే గత ఎన్నికల తర్వాత పవన్ తో తనకు సెట్ కాదని లక్ష్మీనారాయణ ప్రకటించారు. పార్టీని వీడారు. అయితే ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని తిరిగి జనసేనలో చేరతానన్న మీమాంసలో జేడీ ఉన్నట్లు తెలుస్తోంది. పైగా విశాఖ లోక్సభ స్థానానికి విపరీతమైన పోటీ ఉంది. అటు టిడిపి, ఇటు జనసేన, కలిసి వస్తే బిజెపిల నుంచి ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు.ఈ తరుణంలో ఏ పార్టీలో అవకాశం లేకపోవడంతో జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పల్లవి అందుకున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఉన్న పార్టీలకే దిక్కు లేదు.. ఎన్నికల ముంగిట కొత్త పార్టీ పెడితే మాత్రం పెద్దగా వర్క్ అవుట్ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.