అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్ట్ వ్యవహారంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
అన్ని ఆధారాలు ఉండటం వల్లే ఆయనను అరెస్ట్ చేశారని స్పష్టం చేశారు. రాష్ట్ర ఖజానాకు వందల కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించారని, ప్రజా ధనాన్ని దోచుకున్నారనే విషయం తేలిందని అన్నారు.
తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు సజ్జల రామకృష్ణారెడ్డి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో తమ ప్రమేయం లేదని సీమెన్స్ కంపెనీ స్పష్టం చేసిందని చెప్పారు. హవాలా వ్యవహారంపై ఈడీ సైతం విచారణ చేసిందని గుర్తు చేశారు. అన్ని ఆధారాలతో చంద్రబాబును అరెస్టు చేశారని పేర్కొన్నారు.
యువత పేరు చెప్పి చంద్రబాబు అడ్డంగా దోచుకున్నారని సజ్జల ధ్వజమెత్తారు. దోచుకోవడానికే ఒక స్కీంను రూపొందించారని ధ్వజమెత్తారు. ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ కావడం, జైలులో ఉండడమే తప్పన్నట్లు టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కాం డబ్బులు ఎవరి చేతుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు.
స్కిల్ స్కామ్‌తో ప్రభుత్వ ఖజానాకు నేరుగా నష్టం వాటిల్లిందని వివరించారు సజ్జల. షెల్ కంపెనీల ద్వారా క్యాష్‌గా మార్చుకున్నారని, ఖజానాకు వందల కోట్ల నష్టం కలిగించారనే విషయాన్ని పక్కా ఆధారాలతో సీఐడీ రిమాండ్ రిపోర్ట్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. సెంట్రల్ ఏజెన్సీలు కూడా ఈ దోపిడీపై నివేదికలు ఇచ్చాయని గుర్తు చేశారు.
2019 ఏప్రిల్‌లోనే సీమెన్స్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇచ్చిందని, తమకు సంబంధం లేదని ఆ కంపెనీ ప్రతినిధులు చెప్పారని, దీనిపై సెంట్రల్ ఏజెన్సీలకు వివరణ ఇచ్చారని సజ్జల పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఎలాంటి ఒప్పందాన్ని చేసుకోలేదని, తమకు డబ్బులూ అందలేదని సీమెన్స్ ప్రతినిధులు స్పష్టం చేసినట్లు చెప్పారు.
కుంభకోణం డబ్బులు మొత్తం టెక్‌డిజైన్‌కు వెళ్లాయని, అక్కడి నుంచి షెల్ కంపెనీలకు మళ్లించినట్లు తేలిందని సజ్జల చెప్పారు. ఈడీ కూడా హవాలా వ్యవహారంపై దర్యాప్తు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఇష్యూ సిమెన్స్ కంపెనీది కాదని, దాని పేరుతో కుంభకోణానికి పాల్పడింది ఎవరని అన్నారు.
తాము ఎలాంటి అగ్రిమెంట్లు చేసుకోలేదని, తమకు సంబంధం లేకుండా సృష్టించిన ఒక ఎంవోయూ ద్వారా డబ్బులు దోపిడీకి గురయ్యాయని సీమెన్స్ ప్రతినిధులు తేల్చి చెబుతున్నట్లు వివరించారు. తమకు 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నది లేదని సీమెన్స్ సంస్థ చెబుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో ఈ మధ్య కాలంలో కేంద్ర సంస్థ ఐటీ ఇచ్చిన నోటీసుల బట్టి అర్థం చేసుకోవచ్చని, దీనికి ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఐటీ నోటీసులు తీసుకున్న కొందరు దేశం వదలి పారిపోయారని, రాత్రికి రాత్రి వారిని దుబాయ్‌కి పంపించారని సజ్జల విమర్శించారు.
మనోజ్ పార్థసానికి కేసులు కొత్తవి కాదని, డబ్బులు హవాలా రూపంలో దేశం దాటించారని మండిపడ్డారు. ఈ కేసులో కూడా 10 గంటల పాటు వాదోపవాదాలు జరిపారని, చంద్రబాబు ఢిల్లీ నుంచి లాయర్లను తెప్పించుకున్నా, అన్ని అధారాలతో దొరికిపోయినా దబాయిస్తున్నారని చెప్పారు.