AP

ఏపీలోని ఆ నగరాలలో డబుల్ డెక్కర్ మెట్రో..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం మరియు విజయవాడ మెట్రో ప్రాజెక్టులపైన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విశాఖ మరియు విజయవాడలో తొలి దశ మెట్రో ప్రాజెక్టులపై డీపీఆర్ లు సిద్ధం చేశారు. రెండు నగరాలలోనూ డబుల్ డెక్కర్ విధానంలో 25 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టులకు నిర్మించే అంశం పైన సమీక్ష సమావేశం నిర్వహించారు..

 

మెట్రో ప్రాజెక్ట్ లపై అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు

ఏపీ ప్రభుత్వం విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులను పట్టాలెక్కించడానికి సిద్ధమైన వేళ మొత్తం 66 కిలోమీటర్ల మేర విజయవాడ మెట్రో, 76.90 కిలోమీటర్ల మేర విశాఖ మెట్రో ప్రాజెక్టులు చేపట్టడానికి ఇప్పటికే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లను ఆమోదించారు. ఇక 2017 లో వచ్చిన కొత్త మెట్రో పాలసీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులకు ఫండింగ్ మోడల్స్ పైన తాజాగా చంద్రబాబు అధికారులతో సమీక్షించారు.

 

మెట్రో ప్రాజెక్ట్ ల కోసం కేంద్రంతో సంప్రదింపులు

2017 వరకు 100% కేంద్రం భరించే విధానం లేదు. అయితే 2017 పాలసీ ప్రకారం 100% ఈక్విటీ కేంద్రమే చెల్లిస్తూ కలకత్తాలో 16 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టు చేపట్టింది ఇక ఇదే తరహాలో ఏపీలో కూడా మెట్రో ప్రాజెక్టులు చేపట్టే అంశంపై కేంద్రంతో చర్చించాలని చంద్రబాబు భావిస్తున్నారు.

 

మెట్రో నిర్మాణంపై అధికారులకు చంద్రబాబు దిశా నిర్దేశం

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు ఉందని పేర్కొన్న చంద్రబాబు ఆ చట్టప్రకారం తమకు మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేయాలని పేర్కొన్నారు. లేదంటే 2017 మెట్రో పాలసీ ప్రకారం అయినా కేంద్ర సాయం అందించాలని ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని చంద్రబాబు పేర్కొన్నారు. నాలుగేళ్లలో రెండు నగరాలలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.

 

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో

విశాఖ, విజయవాడలో చేపట్టే మెట్రో ప్రాజెక్టులో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయడానికి నిర్ణయించిన చంద్రబాబు హైవే ఉన్నచోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించారు. ఈ విధానంలో కింద రోడ్డు, దానిపైన ఫ్లైఓవర్, ఆపైన మెట్రో వస్తాయి.

 

కేంద్రాన్ని ఒప్పించి మెట్రో నిధులు రాబట్టాలని చంద్రబాబు ప్లాన్

విశాఖలో మొదటి స్టేజ్లో మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కిలోమీటర్లు, గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు నాలుగు కిలోమీటర్ల డబల్ డెక్కర్ మోడల్ లో మెట్రో నిర్మించనున్నారు. ఇక విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కి.మీ డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపడతారు. దీనికి కేంద్రాన్ని ఒప్పించడానికి కేంద్ర సాయం తీసుకోవడానికి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.