ఆదిలాబాద్ జిల్లాలో ఎండిపోయిన ఆకులు కొన్ని రాలినప్పటికీ.. కొత్త చిగురులు వస్తూనే ఉంటాయని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపిలో చేరిన నేపథ్యంలో ఆయన పార్టీని వీడినంత మాత్రాన్నే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదు అనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కొత్త జిల్లాగా ఏర్పడిన మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన సత్యాగ్రహ దీక్ష సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందనడానికి ఈ సభనే నిదర్శనం అని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.
ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటాం..
వెనుకబడిన జిల్లాల జాబితాలో ఆదిలాబాద్ 23వ స్థానంలో ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ తరపున ఆదిలాబాద్ అడవి బిడ్డలకు మాట ఇస్తున్నా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకుని అభివృద్ధి చేయడానికి అన్నివిధాల కృషి చేయడం జరుగుతుంది అని అన్నారు. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మేకవన్నె పులిలా దళితులను వేటాడుతుండు. అంబేద్కర్ పేరుతో దళితుల ఓట్లను కొల్లగొట్టాలని చూస్తున్నాడు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన కేసీఆర్… ఆనాడు మేం ప్రాజెక్టుకు పెట్టిన అంబేద్కర్ పేరును ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.
దళితుల ఓట్ల కోసమే కేసీఆర్ కొత్త డ్రామా..
వచ్చే ఎన్నికల్లో దళితుల ఓట్లు దండుకోవడం కోసమే దళితులపై ప్రేమ కురిపిస్తున్నట్టుగా కేసీఆర్ ఈ కొత్త డ్రామాలకు తెరతీశారు. అవినీతి ఆరోపణలతో ఆనాడు దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసిన కేసీఆర్.. మరి ఈనాడు కుంభకోణాలకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొడుకు కేటీఆర్ ని మంత్రి పదవి నుంచి ఎందుకు బర్తరఫ్ చేయరు అని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఏఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుంది అని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు.
మోడీ, కేడీలను గద్దె దించుతాం..
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని.. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేడీని గద్దె దించి తీరుతాం అని రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. కర్ణాటకలో త్వరలోనే జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రాబోతుంది. కొత్త ఏడాదిలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల మేర రుణమాఫీ చేస్తాం. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తోన్న నిరుద్యోగులను ఆదుకుంటాం అని ప్రకటించారు. రూ. 500 లకే ఆడబిడ్డలకు గ్యాస్ సిలిండర్ అందిస్తాం అలాగే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 5 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తాం అంటూ రేవంత్ రెడ్డి హామీలు గుప్పించారు.
ఉత్తర తెలంగాణలో పట్టు కోసమే..
మంచిర్యాల సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గెతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్రావ్ ఠాక్రె సహా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు పాల్గొని ప్రసంగించారు. ఆదిలాబాద్ జిల్లాలో గతంలో నిర్వహించిన సభతో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోసిన రేవంత్ రెడ్డి.. మంచిర్యాల సభతో మరోసారి ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పట్టు పెంచుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ అభివృద్ధిపై ఫోకస్ చేసిందని చెప్పడానికే ఈసారి అగ్రనేత, ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గెను ఈ సభకు ఆహ్వానించారని తెలుస్తోంది.