AP

ఏపీలో ఎన్నికల ఎఫెక్ట్.. 21 మంది అధికారుల బదిలీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ఇప్పటికే మొదలైంది. ఎన్నికల సంఘం కూడా రంగంలోకి దిగి ఏర్పాట్లు ప్రారంభించింది. తాజాగా, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జోన్-4 పలువురు తహసీల్దార్లు బదిలీ అయ్యారు. మొత్తం 21 మంది అధికారులను బదిలీ చేస్తూ సీసీఎల్ఏ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఈ మేరకు సంబంధిత కలెక్టర్లకు తహసీల్దార్లు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది. కర్నూలు జిల్లా.. పత్తికొండ తహసీల్దార్‌గా పద్మజ, కోసగికి పీ మురళి, కౌతాళంకు అలెగ్జాండర్, అనంతపురం జిల్లా ఉరవకొండ తహసీల్దార్‌గా పద్మావతమ్మ, కళ్యాణదుర్గానికి సుభాకర్ రావు, రాప్తాడుకు రామాంజనమ్మ బదిలీ అయ్యారు.

 

సత్యసాయి జిల్లా మడకశిర తహసీల్దార్‌గా ఏ వెంకటేశ్వర్లు, అన్నమయ్య జిల్లా సుండుపల్లి తహసీల్దార్‌గా జీ పుణ్యవతి.. ఇలా 21 మంది అధికారులు బదిలీ అయిన వారిలో ఉన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల సందడి మొదలైంది. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలువురు అభ్యర్తులను ప్రకటించింది. మరింత మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమైంది.

 

మరోవైపు, తెలుగుదేశం, జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రెండు పార్టీలు కలిసి సంయుక్తంగా తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సుదీర్ఘ చర్చలు జరుపుతున్నాయి. మరోవైపు, జనసేన-బీజేపీ పొత్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీతో కూడా కలిసి వెళ్లాలా? అనేదానిపై బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. ఒకవేళ బీజేపీ తమతో కలిసి రాకుంటే.. టీడీపీ-జనసేన పార్టీలే ఎన్నికల్లో పొత్తుతో వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే టీడీపీ-జనసేన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేస్తున్నప్పటికీ వారి పేర్లను మాత్రం ప్రకటించడం లేదు. మరికొద్ది రోజుల్లో ఈ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.