ఇటీవల తాను సీఎం రేసులో లేనని ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పుట్టినరోజు వేడుకలలో మరోమారు సీఎం పదవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు నల్గొండ జిల్లాలోని బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ వద్ద తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. 60వ జన్మదిన వేడుకలు జరుపుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను సీఎం.. సీఎం అని అనొద్దు అని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. తాను మంత్రి పదవిని వదులుకున్నాను అని తనకు ప్రజల కంటే ఏ పదవి ముఖ్యం కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.
ఐదు సార్లు తనను గెలిపించిన ప్రజల ఋణం ఎప్పటికీ తీర్చుకోలేనిది అని, మీకోసం చావడానికైనా చంపటానికి అయినా తను సిద్ధమేనంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అందరూ తనను సీఎం అని అనొద్దు అని, సీఎం అనకుంటేనే తాను సీఎం అవుతాను అంటూ కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. సీఎం.. సీఎం అంటే అంతా కలిసి ఎమ్మెల్యేగానే గెలవకుండా ఓడిస్తారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
తల్లి బాధలు చూడలేక బావిని తవ్విన 14ఏళ్ళ బాలుడు.. ప్రేమంటే ఇదేరా!!
వచ్చే వారం పది రోజుల్లో నల్గొండలో ప్రియాంక గాంధీ బహిరంగ సభ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తాను ఏనాడు పదవి కోసం ఆశ పడలేదని, తనను వెతుక్కుంటూ పదవులు వచ్చాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం పదవి కోసం తాను పాకులాడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అనేది నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా 20 వేల మందికి అన్నదానం నిర్వహించారు. ఐదు వందల కార్ల భారీ కాన్వాయ్ తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులతో కలిసి బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ వద్దకు చేరుకొని పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.