TELANGANA

బీఆర్ఎస్‌కు ఆకుల లలిత గుడ్‌బై

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పార్టీ మారుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారుతున్నారు.

తాజాగా, ఇద్దరు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఒకరు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. మరొకరు మాత్రం ఏ పార్టీలో చేరాలనేదానిపై సమాలోచనలు జరుపుతున్నారు.

నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ మున్సిపల్ ఛైర్ పర్సన్ అర్చన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఛైర్ పర్సన్ అర్చనతోపాటు మరో ముగ్గురు కౌన్సిలర్లు గాయత్రి, గంగాభవానీ, అమరబోయిన సతీష్ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

సోమవారం అర్చన నివాసంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో వారంతా హస్తం పార్టీలో చేరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో వారికి సముచిత స్థానం కల్పిస్తామని, వారి రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి భరోసా ఇచ్చారు.

 

బీఆర్ఎస్ పార్టీకి మరో కీలక నేత గుడ్‌బై చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ మహిళా అభివృద్ధి సంస్థ ఛైర్ పర్సన్ ఆకుల లలిత రాజీనామా చేశారు. నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశిస్తున్న లలిత.. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

2008లో జరిగిన ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు ఆకుల లలిత. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆర్మూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఆకుల లలిత.

ఆ తర్వాత ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2021, డిసెంబర్ 24న తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు ఆకుల లలిత. అయితే, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఆమె.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేయడంతో అసంతృప్తి గురైన ఆకుల లలిత.. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.