TELANGANA

గ్రామీణ, పట్టణ ప్రయాణికుల ఆర్థికభారం తగ్గించేందుకు ‘టి-9 టికెట్‌’

టీఎస్ఆర్టీసీ ఇటీవల ప్రవేశపెట్టిన టీ9 టిక్కెట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రామీణ, పట్టణ ప్రయాణికుల ఆర్థికభారం తగ్గించేందుకు ‘టి-9 టికెట్‌’ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్‌ సిటిజన్ల కోసం తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన టీ9 టిక్కెట్ ప్రయాణ సమయాన్ని పెంచింది.

ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ టికెట్‌ చెల్లుబాటు అయ్యేది. ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ టికెట్‌ను సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది.

టీ9 టికెట్‌తో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును టీఎస్‌ఆర్టీసీ కల్పించింది. రూ.100 చెల్లించి ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన ప్రయాణికులు.. తిరుగుప్రయాణంలో రూ.20 కాంబీ టికెట్‌తో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. తిరుగుప్రయాణంలో మాత్రమే ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రూ.20 కాంబీ టికెట్‌ వర్తిస్తుంది. టీ9 టికెట్‌ సవరణ సమయాలు, రూ.20 కాంబి టికెట్‌ జులై 9 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ ప్రకటించింది.

పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్స్ కోసం టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం టి-9 టికెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ టికెట్‌తో రూ.100 చెల్లించి 60 కి.మీ పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చెయవచ్చు. జూన్‌ 18న అందుబాటులోకి తెచ్చిన ఈ టికెట్‌కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే 11 వేల మంది ఈ టికెట్‌ను కొనుగోలు చేశారని తెలిపింది.

టి-9 టికెట్‌ సమయాలను సవరించాలని సంస్థ దృష్టికి కొందరు ప్రయాణికులు తీసుకువచ్చారు. ఈ అభ్యర్థలను పరిశీలించిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమయాన్ని సంస్థ పెంచింది. తిరుగు ప్రయాణంలో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో ప్రయాణించేందుకు గాను కొత్తగా రూ.20తో కాంబీ టికెట్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ టికెట్‌ ద్వారా ఒక్కొక్కరికీ రూ.20 నుంచి రూ.40 ఆదా అవుతుంది. ఈ టికెట్‌ను మహిళలు, సీనియర్‌ సిటిజన్స్‌ కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. ఆర్‌టీసీ సంస్థను ఆదరించాలి” అంటూ టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ కోరారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను ఇప్పటికే అందిస్తోండగా.. తొలిసారిగా గ్రామీణ, పట్టణ ప్రయాణికుల సౌకర్యార్థం టి-9 టికెట్ ను సంస్థ అందుబాటులోకి తెచ్చిందని వారు తెలిపారు. ఈ టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.