TELANGANA

పవన్ పోటీ నియోజకవర్గాలపై చంద్రబాబు కీలక సూచన..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. వైసీపీ అభ్యర్దుల ఖరారు ప్రక్రియ తుది దశక చేరింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పైన ఒక అంచనాకు వచ్చారు. బీజేపీతో పొత్తు అంశం తెర మీదకు రావటంతో సీట్ల ప్రకటన వాయిదా పడింది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాల పైన ఆసక్తి కొనసాగుతోంది. తాజాగా చంద్రబాబుతో చర్చల్లో పవన్ పోటీ చేసే నియోజకవర్గాల పైన క్లారిటీ వచ్చినట్లు సమాచారం.

 

కొత్త లెక్కలు : పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో తన పార్టీకి గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖలో ఎక్కువ సీట్లు ఇవ్వాలని కోరుతున్నారు. జనసేన 40 సీట్లకు తక్కువగా కాకుండా పోటీ చేయాలని జనసైనికులు, పార్టీ నేతల నుంచి పవన్ పైన ఒత్తిడి కొనసాగుతోంది. జనసేనకు 22-25 సీట్ల వరకు ఖరారు చేసేందుకు చంద్రబాబు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ పొత్తులో కలిస్తే ఈ సీట్ల సంఖ్య కొంత మేర తగ్గే అవకాశం కనిపిస్తోంది. కానీ, ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ తమ పార్టీకి కేటాయించే సీట్ల సంఖ్య పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. జనసైనికుల గౌరవం తగ్గకుండా సీట్లు సాధిస్తామని చెప్పారు. దీంతో, ఖచ్చితంగా 40 సీట్లు జనసేనకు పొత్తు లో దక్కుతాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

 

పవన్ పోటీ ఎక్కడ : ఇదే సమయంలో పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానం పైన అంచనాలే మినహా అధికారికంగా స్పష్టత లేదు. పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు పొత్తులో భాగంగా పవన్ తిరిగి రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అందులో గోదావరి జిల్లాల్లో భీమవరం నుంచి పోటీ ఖాయమని సమాచారం. పవన్ ఉత్తరాంధ్ర నుంచి ఈ సారి రెండో సీటుగా పోటీ చేసేందుకు శ్రీకాకుళం జిల్లా వైపు ఫోకస్ చేసినా..తాజాగా చంద్రబాబు సూచనతో ఆలోచన మార్చుకున్నారని చెబుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో వైసీపీ ఎక్కువ సీట్ల తిరిగి గెలిచేలా వ్యూహ రచన చేస్తోంది. దీంతో, పవన్ ను తిరుపతి లేదా అనంతపురం సిటీ నుంచి బరిలో నిలవాలని చంద్రబాబు సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.

 

రెండు స్థానాల్లో పోటీ : ఇప్పటికే అనంతపురం సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సైతం పవన్ తన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే తాను స్వచ్చందంగా తప్పుకుంటానని ప్రకటించారు. పవన్ ఖచ్చితంగా రెండు స్థానాల్లో పోటీ చేస్తారని పార్టీ నేతలు వెల్లడించారు. అయితే, నందమూరి బాలయ్య అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తుండటంతో అక్కడి నుంచి పవన్ పోటీకి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రాయలసీమ కు కేంద్రంగా ఉన్న తిరుపతి నుంచి పవన్ బరిలోకి దిగటం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సర్వేలు పూర్తయ్యాయి. దీంతో, బీజేపీతో పొత్తు వ్యవహారం కొలిక్కి వచ్చిన తరువాత పవన్ పోటీ చేసే నియోజకవర్గాల పైన అధికారికంగా ప్రకటన వెలువడనుంది.