AP

వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన సీమ సభ..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపత్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల సమరానికి సమాయాత్తమౌతున్నారు.

 

ఇప్పటికే రెండు విడతల్లో సిద్ధం బహిరంగ సభలు ముగిశాయి. విశాఖపట్నం జిల్లా భీమిలీలో నిర్వహించిన సభ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. లక్షలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య ఎన్నికల రణభేరిని మోగించారు. క్యాడర్‌లో ఎన్నికల ఊపును తీసుకొచ్చారు.

 

దీని తరువాత ఏలూరు జిల్లా దెందులూరులో రెండో బహిరంగ సభను నిర్వహించింది వైఎస్ఆర్సీపీ. అదీ గ్రాండ్ సక్సెస్ అయింది. లక్షలాది మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. ఈ సభకు తరలివచ్చారు. ఇప్పుడదే స్పీడ్‌ను కొనసాగిస్తోంది వైఎస్ఆర్సీపీ. తరువాతి సభకు సిద్ధపడుతోంది.

 

ఈ నెల 18వ తేదీన అనంతపురం జిల్లా రాప్తాడులో మూడో సిద్ధం బహిరంగ సభను నిర్వహిస్తోంది. తొలి రెండు సభల కంటే భారీగా జనాన్ని సమీకరించేలా ఏర్పాట్లను పూర్తి చేశారు రాయలసీమ జిల్లాలకు చెందిన వైసీపీ నాయకులు. పార్టీ సీనియర్ నేత, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోన్నారు.

 

ఇదే సభలో వైఎస్ జగన్.. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేసే అవకాశం ఉండంటం, ఆయన సొంత ప్రాంతం కావడం వల్ల ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు పార్టీ నాయకులు. 280 ఎకరాల్లో ఈ సభను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అయిదు లక్షలమందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

 

ఈ సభ ఏర్పాట్లపై ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలను గెలవాలనే లక్ష్యంతో పని చేస్తోన్నామని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన ప్రభుత్వం తమదేనని అన్నారు. తెలుగుదేశం పార్టీ 600పైగా హామీలను ఇచ్చిందని, వాటిల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు.