TELANGANA

కరెంట్ బిల్లులు కట్టవద్దు, సోనియాకు పంపండి – కేటీఆర్..!!

మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా లండన్ లో ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారానికి కారణమయ్యాయి. వీటి పైన కేటీఆర్ స్పందించారు. 100 మీటర్ల లోపల పార్టీని బొందపెట్టే సంగతి తర్వాత చూద్దామని.. వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలపై దృష్టిపెట్టాలంటూ సూచించారు. అదే సమయంలో తెలంగాణ ప్రజలు జనవరి కరెంట్ బిల్లులు చెల్లించవద్దంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.

 

దావోస్ పర్యటన ముగించుకొని లండన్ వెళ్లిన సీఎం రేవంత్ రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యల పైన కేటీఆర్ సీరియస్ గా స్పందించారు. రేవంత్ అహంకారంతో మాట్లాడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్‌ వంటి నేతలను తమ ప్రస్థానంలో చాలామందిని చూసిందని చెప్పారాయన. తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావ్ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదే సమయంలో కరెంట్ బిల్లులపై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దని పిలుపునిచ్చారు. కరెంటు బిల్లుల గురించి అడిగితే అధికారులకు సీఎం గతంలో చేసిన మాటలను చూపించాలని కేటీఆర్ సూచించారు. సోనియా గాంధీ బిల్లు కడతారని రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారని ఆయన వివరించారు.

 

కరెంటు బిల్లు ప్రతులను సోనియా ఇంటికి పంపించాలని ప్రజలను కోరారు. హైదరాబాద్‌లోని ప్రతి ఒక్క మీటర్‌కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ కు ఏరోజు పొత్తు లేదని..భవిష్యత్ లో ఉండదని స్పష్టం చేసారు. రేవంత్ రక్తం అంతా బీజేపీదేనని వ్యాక్యానించారు. అందుకే ఒక్కడ చోటీ మోదీగా రేవంత్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. డబుల్ ఇంజన్ అంటే ఆదానీ, ప్రధాని అని చెప్పిన రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ గా మారారాని విమర్శించారు. రేవంత్ కాంగ్రెస్ లో ఏక్ నాధ్ షిండేగా మారుతారని కీలక వ్యాఖ్యలు చేసారు. బీఆర్ఎస్ పార్టీ రెండున్నార దశాబ్దాలు నిలబడి రేవంత్ లాంటోళ్లు మట్టి కరింపించిందని కేటీఆర్ పేర్కొన్నారు.