TELANGANA

తెలంగాణలో కరోనా కలకలం.. ఒకరు మృతి..

2020లో కరోనా వ్యాప్తి ప్రారంభమైంది. 2021లోనూ కొనసాగింది. వేలాదిమంది మృత్యువాత పడ్డారు. ప్రపంచాన్ని వణికించింది ఈ మహమ్మారి. వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో వైరస్ వ్యాప్తి తగ్గింది. గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి ప్రభావం చూపలేదు. కానీ తాజాగా కొత్త సబ్ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంది. దీంతో దేశవ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా కేరళలో మాత్రం పరిస్థితి విషమంగా ఉంది. అక్కడ వందలాది కేసులు నమోదవుతుండడంతో ప్రభుత్వం అలెర్ట్ అయింది.

 

తాజాగా తెలంగాణలో కేసులు పెరుగుతుండడం.. ఒక వ్యక్తి మృత్యువాత పడటంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. వైద్య శాఖ సన్నద్ధంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాల మంత్రులతో కోవిడ్ సన్నద్ధతపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహ రాష్ట్ర అధికారులతో సమావేశం నిర్వహించారు. గురువారం అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివ్ రేటు కేవలం 0.37 ఉన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.