ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకో రెండు రోజులే మిగిలివుంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం మహోజ్వల ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మించిన స్థలంలో ఆలయం అందుబాటులో రానుంది.
రామమందిరం ప్రారంభోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ.. సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలనూ పరిశుభ్రంగా ఉంచేలా స్వచ్ఛ అభియాన్‌ను ప్రారంభించారు. కొద్దిరోజుల కిందటే నాసిక్‌లోని ప్రాచీన కాలా రామ్ ఆలయం ప్రాంగణం మొత్తాన్నీ శుభ్రపరిచారు.
ఆయన ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర/రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఆయా రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్నికొనసాగిస్తోన్నారు. తమ సమీప ఆలయాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుతున్నారు.
తాజాగా- తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై గల శ్రీ హనుమాన్ ఆలయంలో స్వచ్ఛ అభియాన్‌ను నిర్వహించారు. చీపురు పట్టి ఆలయం మొత్తం ఊడ్చారు. చెత్తను ఎత్తి పడేశారు. తడిబట్టతో శుభ్రం చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
ఈ ఉదయం ఆలయానికి వచ్చిన గవర్నర్‌ను ఆలయ పాలకమండలి సభ్యులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛ అభియాన్ స్వామివారిని దర్శించుకున్న అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు.
అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆలయాల్లో స్వచ్ఛ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ మోదీ ఇచ్చిన పిలుపునకు లక్షలాది మంది స్పందిస్తోన్నారని పేర్కొన్నారు.