తెలంగాణ మంత్రులు ఇటీవల కాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇతరులపై చేయి చేసుకుంటూ రాష్ట్ర మంత్రులు తరచూ వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవలే మంత్రి తలసాని ఇందిరాపార్క్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సమయంలో మంత్రి కేటీఆర్ పక్కన నడుస్తున్న బైంసా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్‌ను వెనక్కి లాగి మరి చెంప దెబ్బ కొట్టారు.
ఈ ఘటన మరువక ముందే అధికార బీఆర్ఎస్లోని మరో మంత్రి వివాదంలో చిక్కుకున్నారు.తాజాగా హోంమంత్రి మహమూద్ అలీ తన గన్‌మెన్ చెంపపై కొట్టారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా ఆయనను ఆలింగనం చేసుకుని విషెస్ చెప్పారు. అంతలోనే బొకే ఎక్కడ? అంటూ పక్కనే ఉన్న గన్‌మెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సహనం కోల్పోయినహోంమంత్రి గన్‌మెన్‌పై చేయి చేసుకున్నారు.
ఆయనను తలసాని వద్దులేండీ అంటూ వారించారు. హోంమంత్రి మహమూద్ అలీ తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న కారణానికే గన్‌మెన్‌ను కొట్టాలా అంటూ హోంమంత్రి మహమూద్ అలీపై మండిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.