AP

షర్మిలపై వైసీపీ అటాక్ మొదలు..

కాంగ్రెస్ పార్టీలో ఇవాళ తన పార్టీ వైఎస్సార్టీపీని విలీనం చేసిన వైఎస్ షర్మిల.. తనతో పాటు మరికొందరితో కలిసి ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. తనకు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా నెరవేరుస్తానంటూ వ్యాఖ్యానించారు. రేపోమాపో ఆమెను ఏపీసీసీ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం కూడా ఖాయమే. ఈ నేపథ్యంలో ఏపీలో తాను విభేదిస్తున్న అన్న పార్టీ వైఎస్సార్సీపీ నేతలు ఆమెపై మాటల దాడి ప్రారంభించారు.

 

వైసీపీలో అవకాశం లేకనే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకుందంటూ వైసీపీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్ చార్జ్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. నిన్న మొన్నటివరకూ షర్మిల చేరికపై తనకు సమాచారమే లేదన్న వైవీ.. ఇవాళ మాత్రం ఘాటుగానే స్పందించారు. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి వైఎస్సార్టీపీని షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేసిందని విశ్లేషించారు. ఎవరు ఏ పార్టీ లో చేరినా అందరూ కలిసి పోటీచేసినా తమకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు.

 

మరోవైపు వైసీపీ సర్కార్ లో సీనియర్ మంత్రి, సీఎం జగన్ సన్నిహితుడు కూడా అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిలే కాదు కాంగ్రెస్ లో ఎవరు చేరినా రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తామన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే వారిని ప్రతిపక్షంగానే చూస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు, సోనియాది కుటుంబాలను కాదు.మనుషులను చీల్చే రాజకీయమంటూ మండిపడ్డారు. తద్వారా జగన్ కుటుంబాన్ని వీరు చీల్చారనే అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు.