AP

‘అమరావతి’కి గుడ్ న్యూస్..

భారతీయ రైల్వే ప్రయాణికులకు, ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు మంచి శుభవార్త. కొన్నాళ్లుగా విజయవాడ నుంచి హుబ్లీ మధ్య నడుస్తోన్న అమరావతి ఎక్స్ ప్రెస్ రైలును నర్సాపూర్ వరకు పొడిగించారు. ఈ పొడిగించిన రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. విజయవాడ-నరసాపూర్ మధ్య డబ్లింగ్ పనులు పూర్తయ్యాయి.

 

వాస్తవానికి అమరావతి ఎక్స్ ప్రెస్ ను గత నవంబరు నుంచే నరసాపూర్ నుంచి నడుపుతున్నారు. అప్పట్లోనే కిషన్ రెడ్డిచేత ప్రారంభించడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన బిజీగా ఉండటంతో కుదర్లేదు. అప్పటినుంచే నరసాపూర్ నుంచి నడవాల్సిన రైలును విజయవాడ నుంచే నడుపుతున్నారు. స్థానిక బీజేపీ నాయకులు ఈ విషయాన్ని కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వర్చువల్ గా ప్రారంభించేందుకు ఒప్పుకున్నారు.

 

17225 నెంబర్‌తో మధ్యాహ్నం 3.00 గంటలకు నరసాపురంలో బయలుదేరి విజయవాడ, గుంటూరు, మార్కాపురం, నంద్యాల, గుంతకల్‌, బళ్లారి, హోస్పేట మీదుగా తర్వాతరోజు ఉదయం 11.20 గంటలకు హుబ్లీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 17226 నెంబర్‌తో హుబ్లీలో బయలుదేరి తర్వాతరోజు ఉదయం 7.00 గంటలకు నరసాపురం వస్తుంది. పాలకొల్లు, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం రోడ్, గిద్దలూరు, కంభం, నంద్యాల, డోన్, పెండేకల్లు, గుంతకల్, బళ్లారి, తోరణగల్లు, హాస్ పేట, మునిరాబాద్, కొప్పల్, గదగ్, అన్నిగెరి స్టేషన్లలో ఆగుతుంది.

 

గోవా వెళ్లేవారికి ఈ రైలు ఎంతో ప్రయోజనకారిగా ఉండనుంది. కొన్ని బోగీలను హుబ్లీలో వేరు చేసి హైదరాబాద్‌ నుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్‌కు కలుపుతారు. తిరుగు ప్రయాణంలో హైద్రాబాద్‌ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌కు గోవాలో జత చేసి వాటిని హుబ్లీలో అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు కలుపుతారు. దీనివల్ల మరో రైలు మారాల్సిన అవసరం ఉండదు. రాయలసీమ, కర్ణాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది.