AP

వైసీపీ లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్..

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడుకు ఏడు స్థానాల్లో అధికార వైసీపీ గెలవాల్సి ఉన్నా.. క్రాస్‌ ఓటింగ్‌తో ఓ స్థానాన్ని కోల్పోయింది.. దీంతో, వైసీపీకి షాక్‌ తగిలినట్టు అయ్యింది.. ఇక, దిద్దబాటు చర్యలకు దిగింది వైసీపీ అధిష్టానం.. క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను గుర్తించింది.. తన మార్టీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. టీడీపీకి అనుకూలంగా ఓటు వేసినట్టు నిర్ధారణకు వచ్చింది.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్‌ ఉల్లంఘించినందుకు ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది.. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు.

 

సీఎం వైఎస్‌ జగన్ చివరి నిమిషంలో చెప్పి షాక్‌లు ఇవ్వరు.. పారదర్శకంగా వ్యవహరించే నాయకుడు జగన్ అని తెలిపారు సజ్జల.. అందుకే ముందుగానే టికెట్ ఇచ్చే అవకాశం లేదని వారికి సంకేతాలు ఇచ్చారని.. అందుకే వారు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారని మండిపడ్డారు.. ఇక, చంద్రబాబు నాయుడు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు, రూ. 20 కోట్ల వరకు డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టారని మాకు సమాచారం ఉందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. మాకున్న సమాచారం, విచారణ ఆధారంగానే ఈ నలుగురు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని పార్టీ అభిప్రాయానికి వచ్చింది.. అందుకే సస్పెండ్‌ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

 

ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి.. ఇది రోగం లాంటిది.. అందుకే ముందే నిర్ణయం తీసుకున్నాం అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.. డబ్బులు చేతులు మారాయి.. ఇతర కారణాలు కనిపించలేదన్న ఆయన.. టికెట్లు ఇస్తామని కూడా చెప్పి ఉండవచ్చు అని తెలిపారు.. గతంలోనూ చంద్రబాబు ఇలానే ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు.. తర్వాత పూర్తి స్థాయిలో పేమెంట్లు కూడా చేసినట్లు లేడు అంటూ ఎద్దేవా చేశారు.. ఇటువంటి విషయాల్లో పార్టీ సీరియస్ గా ఉంటుంది.. అందుకే చర్యలు తీసుకున్నామని ప్రకటించారు సజ్జల రామకృష్ణారెడ్డి. కాగా, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నిక‌ల్లో ప్రతిప‌క్ష టీడీపీ అభ్యర్థి పంచుమ‌ర్తి అనురాధ గెలుపొందేందుకు అవ‌స‌ర‌మైన మెజారిటీ లేకున్నా 23 ఓట్లతో విజ‌యం సాధించారు. దీంతో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన‌ట్లు తేలిపోయిన విషయం విదితమే.