CINEMA

రాజా సాబ్‌గా ప్రభాస్ ఎంట్రీ.. ఊహించని గెటప్‌లో.. ఇది కదా అసలైన సంక్రాంతి సర్‌ప్రైజ్..

తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు తనదైన చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరించి.. ఈ మధ్య కాలంలో బహు భాషా చిత్రాలను చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలతో సత్తా చాటిన అతడు.. ఇటీవలే ‘సలార్: సీజ్‌ఫైర్’ మూవీతో వచ్చాడు. ఈ చిత్రంతో చాలా రోజుల తర్వాత ఓ విజయాన్ని అందుకున్నాడు.

 

‘సలార్: సీజ్‌ఫైర్’ సక్సెస్ ఇచ్చిన జోష్‌లో ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ చేశాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే పట్టాలెక్కించిన పలు చిత్రాలను ఒక్కొక్కటిగా పూర్తి చేయబోతున్నాడు. అందులో టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందించే మూవీ ఒకటి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై.. చాలా భాగం టాకీ పార్ట్ కూడా పూర్తైంది.

రెబెల్ స్టార్ ప్రభాస్ – మారుతి కాంబోలో హర్రర్ కామెడీ మూవీగా రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రచార చిత్రమూ రాలేదు. దీనిపై డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్లు వార్తలు వచ్చినా అలా జరగలేదు.

 

ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ గురించి డార్లింగ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే దీన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేయడంతో పాటు ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలింది.

 

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ఈ చిత్రానికి ‘ది రాజా సాబ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రివీల్ చేశారు. అంతేకాదు, ఇందులో రెబెల్ స్టార్ ఊరమాస్ లుక్‌తో దర్శనమిచ్చాడు. పైన బ్లాక్ షర్ట్.. కింద పూల లుంగీతో తొలిసారి డిఫరెంట్ గెటప్‌లో కనిపించాడు. దీంతో ‘ది రాజా సాబ్’ పోస్టర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

 

భిన్నమైన కాంబినేషన్‌లో రాబోతున్న ‘ది రాజా సాబ్’ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.