AP

జనసేనకు మరో ఎంపీ అభ్యర్ధి…

ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో గుడ్ న్యూస్. ఇప్పటికే ఓవైపు బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీలో చేరికలు పెరుగుతుండగా.. ఇవాళ ఓ కీలక నేత ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన ఆయన.. జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

 

టీడీపీతో పొత్తులో భాగంగా దాదాపు 40 ఎమ్మెల్యే సీట్లతో పాటు రెండు ఎంపీ సీట్లు కూడా అడుగుతున్న జనసేన పార్టీని పలు చోట్ల అభ్యర్ధుల కొరత వేధిస్తోంది. అయితే తాజాగా మారుతున్న పరిస్ధితుల్లో ముఖ్యంగా ఎంపీ అభ్యర్ధుల కొరత ఎదుర్కొంటున్న జనసేనకు ఊరటనిచ్చేలా ఓ సీనియర్ నేత, మాజీ మంత్రి ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఉత్తరాంధ్రలో ఎంపీగా పోటీ చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు.

 

పవన్ కళ్యాణ్ తో ఇవాళ హైదరాబాద్ లో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. త్వరలో జనసేన పార్టీలో చేరేందుకు సంసిద్ధత తెలిపారు. అనకాపల్లి పార్లమెంటు స్ధానంలో జనసేన తరఫున ఆయన పోటీ చేయనున్నారు. బీసీల్లో గవర సామాజిక వర్గానికి చెందిన కొణతాల.. 1989 నుంచి 96 వరకూ ఎంపీగా పనిచేశారు. 2004-2009 వరకూ వైఎస్ కేబినెట్లో ఎక్సైజ్,న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్ మరణం తర్వాత వైసీపీలో చేరి పీఏసీ ఛైర్మన్ గా కూడా వ్యవహరించారు. 2014 ఎన్నికల తర్వాత మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

 

అప్పటి నుంచీ ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడుతున్న కొణతాల రామకృష్ణ.. ఇప్పుడు జనసేనలో చేరితే ఆ మేరకు పార్టీకి, ఆయనకూ ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా గతంలో పలుమార్లు గెలిచిన అనకాపల్లి సీటులో కొణతాలను బరిలోకి దింపితే జనసేన పార్టీ ఎంపీ గెల్చుకోవడం సునాయాసం అవుతుందని అంచనా వేస్తున్నారు. కొణతాల పోటీ ఖరారైతే జనసేన తరఫున తొలి ఎంపీ అభ్యర్ధి ఆయనే అవుతారు.