వైసీపీ ఆవిర్భావం నుంచి రెడ్డి సామాజిక వర్గం ఆ పార్టీ వెంట నడుస్తోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని జగన్ విభేదించారు. అటు జగన్కు సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ హై కమాండ్ ఒప్పుకోకపోవడంతో జగన్ సొంత పార్టీని పెట్టుకున్నారు. ఆ సమయంలో రాయలసీమలోని రెడ్డి సామాజిక వర్గమంతా ఏకతాటిపైకి వచ్చింది. జగన్కు అండగా నిలబడింది. చాలామంది మంత్రులు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జగన్ కు మద్దతు తెలిపారు. జగన్ వెంట అడుగులు వేశారు. 2019లో అయితేరెడ్డి సామాజిక వర్గం ఏకతాటిపైకి వచ్చి జగన్ సీఎం అయ్యేందుకు దోహద పడింది. ఆ ఎన్నికల్లో రాయలసీమలో 52 స్థానాలకు గాను… 49 స్థానాల్లో వైసిపి గెలుపు వెనుక రెడ్డి సామాజిక వర్గం ఉంది.
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనాలు లేవు. ఆ నలుగురికి తప్ప.. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు సైతం ప్రత్యేక ప్రయోజనాలు ఏవి కల్పించలేకపోయారు. సామాజిక వర్గంలో కింది స్థాయిలో ఉన్నవారికి పథకాలు దక్కలేదు.రాయలసీమకు ప్రత్యేక ప్రాజెక్టులు సైతం తెప్పించుకోలేకపోయారు.నీటి సమస్యలు తీర్చలేకపోయారు. ఉన్న పరిశ్రమలను సైతం వెళ్ళగొట్టారు. ఇవన్నీ సొంత సామాజిక వర్గంలో అంతులేని అసంతృప్తికి కారణమయ్యాయి.
అయితే రెండోసారి అధికారంలోకి రావడానికి అదే రెడ్డి సామాజిక వర్గాన్ని బలి పశువు చేయాలని జగన్ చూస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గాన్ని తప్పించి బీసీలు, ఎస్సీలను తెరపైకి తెస్తున్నారు. దీంతో రెడ్డి సామాజిక వర్గం మండిపడుతోంది. ఇప్పటికే రాయలసీమలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అసంతృప్తిని చూపించారు. తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఇప్పుడు జగన్ చేజేతులా రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకుంటుండడంతో.. వారంతా టిడిపి, జనసేన గూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాయలసీమలో స్పష్టమైన మార్పు దిశగా రాజకీయ సమీకరణలు మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.