TELANGANA

ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధరణిపై సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్ లో లోపాలపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ కు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు నివేదికలో పొందుపరచాలని స్పష్టం చేశారు. ధరణి యాప్ సెక్యూరిటీపైనా సీఎం రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణి లావాదేవీలపై వస్తున్న ఆరోపణలకు డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

 

ధరణి పోర్టల్ రూపకల్పన ఎవరికి ఇచ్చారు? టెండర్ పిలిచారా? అనే అంశాలపైనా రేవంత్ అధికారులతో సమీక్షించారు. ఏ ప్రాతిపదికన వెబ్‌సైట్‌ క్రియేట్ చేసేందుకు అవకాశం ఇచ్చారు లాంటి అన్ని అంశాలు ఆ నివేదికలో ఉండాలన్నారు. పాస్ బుక్కులో ఉన్న తప్పులను సవరించాల్సిన సమయం వచ్చిందన్నారు. ధరణికి అసలు చట్ట బద్ధత ఏంటి? అని అధికారులను ప్రశ్నించారు. సాదా బైనామాల్లో తప్పు తొలగించాలని చెప్పారు. దాంతో పాటు భూ సమగ్ర సర్వే నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కంప్యూటర్లనే నమ్ముకోకుండా.. జమా బంది రాయాలన్నారు.

 

అటు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై మాట్లాడారు. అలాగే కొన్ని కీలక అంశాలను చర్చించారు. రాష్ట్రానికి కేంద్రం సహకారం అందించాలని కోరారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ప్రముఖులతో భేటీ అయ్యేలా చొరవ చూపాలని కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ కోరారు