ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది. ఇంకో మూడు రోజులు మిగిలివుంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం మహోజ్వల ఘట్టం ఆరంభమౌతుంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మించిన స్థలంలో ఆలయం అందుబాటులో రానుంది.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా వేలాదిమంది ప్రముఖులు హాజరు కానున్నారు. వివిధ దేశాల నుంచి వందమంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు అందాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటీనటులు, సెలెబ్రిటీలకు ఆహ్వానం అందింది.
ఈ నెల 15వ తేదీ నాడే ప్రారంభోత్సవ కార్యక్రమాలు, ఆచారాల మొదలయ్యాయి. ఆగమోక్తంగా పూజాదికాలను నిర్వహిస్తోన్నారు అర్చకులు. వేదమంత్రోచ్ఛారణలతో అయోధ్యా నగరం మారుమోగిపోతోంది. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సరయూ నదీ తీరం మొత్తం రామభక్తులతో నిండిపోయింది. ఘాట్ల వద్ద భక్తులు రామ నామజపంతో తరించిపోతున్నారు.
ఇప్పటికే రాములోరు.. ఆలయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. గర్భగుడిలో ప్రతిష్ఠించిన అనంతరం బయటికొచ్చిన మొట్ట మొదటి ఫొటోలు ఇవి. ఈ విగ్రహం ముఖం, పైభాగాన్ని వస్త్రాలతో కప్పి ఉంచారు. ఈ మధ్యాహ్నం అర్చకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వాటిని తొలగించారు.
కర్ణాటక మైసూరుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన విగ్రహం ఇది. దీని ఎత్తు 51 అంగుళాలు. నల్లరాతి శ్రీరామచంద్రుడి నిలువెత్తు విగ్రహాన్ని చెక్కారాయన. 150 నుంచి 170 కిలోల బరువు ఉంటుంది. 70 సంవత్సరాలుగా రామ జన్మభూమిలో పూజలు అందుకుంటోన్న రామ్ లల్లా విగ్రహం గర్భాలయంలోనే ఉంచారు.
గురువారం అయోధ్యా రాముడు గర్భగుడిలోకి ఏతెంచిన విషయం తెలిసిందే. విగ్రహాన్ని ప్రతిష్ఠించిన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన సంకల్పాన్ని తీసుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేలా, ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం దేశం సుభిక్షంగా ఉండేలా సంకల్పం తీసుకున్నారు వేద పండితులు.