AP

జగన్ ట్రాప్ లో చంద్రబాబు – ఎన్నికల వేళ సెల్ఫ్ గోల్..!! .

ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సీఎం జగన్ తన పార్టీ అభ్యర్దుల ఖరారు ప్రక్రియ వేగవంతం చేసారు. టీడీపీ, జనసేన అభ్యర్దుల ఎంపిక పైన చర్చలు కొనసాగిస్తున్నాయి. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఈ సమయంలోనే సీఎం జగన్ కొత్త అస్త్రాలను ప్రత్యర్ధి పార్టీలను ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 

జగన్ కొత్త లెక్కలు:ముఖ్యమంత్రి జగన్ సంక్షేమం, సామాజిక న్యాయం అస్త్రాలుగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఎన్ని పార్టీలు కలిసినా తాను సింగిల్ గానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో ఎన్నికలకు ముందుగా సంక్షేమ పథకాల అమలు పైన ఫోకస్ చేసారు. ఈ నెల, వచ్చే నెల కీలకమైన పథకాల అమలుకు నిర్ణయించారు. ఇక..అభ్యర్దుల ఖరారులోనూ సామాజిక సమీకరణాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలను 2019 అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ ఓన్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో లేని విధంగా ఆ వర్గాలకు పదవులు, పోస్టుల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు విజయవాడ నడి బొడ్డున 125 అడుగులు అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేళ రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది.

 

ట్రాప్ లో ప్రతిపక్షాలు:ముఖ్యమంత్రి జగన్ విజయవాడలో 125 అడుగులు అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసారు. భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. తన పాలనలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. చంద్రబాబు దళితులతో ఏ విధంగా వ్యవహరించారో వివరించారు. విజయవాడ లోక్ సభ స్థానంలో టీడీపీ వరుసగా విజయం సాధిస్తోంది. 2019లో అక్కడ నుంచి గెలిచిన కేశినేని నాని ఇప్పుడు వైసీపీ లో చేరారు. ఇప్పుడు అదే విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ద్వారా స్థానికంగా సామాజిక సమకరణాల్లో జగన్ కొత్త చర్చకు కారణమయ్యారు. అంబేద్కర్ విగ్రహాన్ని సీపీఐ నేతలు సందర్శించి ప్రశంసించారు. ఇప్పటి వరకు టీడీపీ, కాంగ్రెస్, జనసేన నేతలు సందర్శించ లేదు. ప్రతిపక్షాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వం ఆహ్వానాలు పంపినా వారు హాజరు కాలేదు.

 

ఎన్నికల వేళ కొత్త వ్యూహం:టీడీపీ ఎంపీ కనకమేడల, ఎమ్మెల్సీ అశోక్ బాబు వంటి వారికి ప్రోటోకాల్ లో భాగంగా ఆహ్వానాలు పంపినా..వారు హాజరు కాకపోవటం చర్చకు కారణమైంది. టీడీపీ మద్దతు మీడియా అంబేద్కర్ విగ్రహావిష్కరణ కు కవరేజ్ ఇవ్వకపోవటాన్ని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పైన చంద్రబాబు, పవన్, లోకేష్ వంటి వారు విగ్రహావిష్కరణను స్వాగతిస్తూ ఎటువంటి ప్రకటన చేయలేదు. తాము స్పందిస్తే జగన్ కు మైలేజ్ వస్తుందనే అంచనాతో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, వారు స్పందించని తీరును వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విగ్రహావిష్కరణ పైన ఆసక్తి కర చర్చ సాగుతోంది. చంద్రబాబు అండ్ టీం పైన జరుగుతున్న దళిత వ్యతిరేక చర్చకు అవకాశం ఇవ్వటం ద్వారా టీడీపీ సెల్ఫ్ గోల్ చేసుకుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.