AP

చంద్రబాబుతో పవన్ భేటీ, కీలక మలుపు – ఢిల్లీకి ప్రయాణం..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతోంది. ఇటు ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ భేటీ అయ్యారు. ఏపీలో ఎన్నికల కార్యాచరణ పైన చర్చించారు. చంద్రబాబు – పవన్ కలిసి జిల్లా సభల్లో పాల్గొనటం..మేనిఫెస్టో..సీట్ల ఖరారు పైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే సమయంలో బీజేపీతో పొత్తు పైన చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ సమయంలోనే చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు.

 

కొత్త సమీకరణాలు : ఏపీలో ఎన్నికలకు చంద్రబాబు – పవన్ సిద్దం అవుతున్నారు. హైదరాబాద్ లో ఇద్దరు నేతల కీలక భేటీ జరిగింది. నారా లోకేశ్..నాదెండ్ల మనోహర్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెలలోనే మూడు రీజియన్లతో ఇద్దరూ కలిసి మూడు భారీ బహిరంగ సభల్లో పాల్గొనాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. ఈ నెల 17న భీమిలి లో లోకేశ్ యువగళం యాత్ర ముగింపు సభకు ఇద్దరు నేతలు హాజరు కానున్నారు. ఇక..తెలంగాణలో టీడీపీ పోటీకి దూరంగా ఉంటే..జనసేన బీజేపీతో కలిసి పోటీ చేసింది. కానీ ఎక్కడా డిపాజిట్లు రాలేదు. ఇప్పుడు ఏపీలో బీజేపీ తమతో కలిసి రావాలని పవన్ ప్రతిపాదించారు. దీని పైన బీజేపీ నుంచి స్పష్టత రాలేదు. కానీ, బీజేపీ నిర్ణయం ఏంటనేది తెలుసుకోవాలని..దానికి అనుగుణంగా కార్యాచరణ ఖరారు చేయాలని భావిస్తున్నారు.

 

 

కార్యాచరణ పై చర్చ : ఏపీలో ప్రయోజనాల కోసమే తెలంగాణలో బీజేపీతో పొత్తుతో ముందుకు వెళ్లామని పవన్ చెబుతున్నారు. బీజేపీ వైఖరి పైన స్పష్టత వస్తే సీట్ల అంశం పైన క్లారిటీ వస్తుందని..అందు కోసం త్వరలోనే ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశం కావాలనేది పవన్ ఆలోచనగా సమాచారం. ఇదే సమయంలో బీజేపీతో పొత్తు పైన టీడీపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ, ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు అవసరమని ఇద్దరు నేతలు భావిస్తున్నారు. రెండు పార్టీల మేనిఫెస్టో అంశాల పైన ఒప్పటికే ఒక అంగీకారానికి వచ్చారు. ఈ నెలలో మేనిఫెస్టోకి పూర్తి రూపు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కేంద్రంలో ముందస్తుగానే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనే చర్చతో అప్రమత్తం కావాలని నిర్ణయించారు.

 

 

బీజేపీ కలిసేనా – లేదా : ఇక, రేపు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు.ఏపీలో ఓట్ల అక్రమాలపై సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. ఈ నెల 10న కేంద్ర ఎన్నికల కమిషన్ చెందిన బృందం రాష్ట్రనికి రానుంది. రాష్ట్రానికి వచ్చే ముందే ఢిల్లీ వెళ్లి సీఈసీని కలవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ సమయంలోనే కేంద్రంలోని ఒక ముఖ్య నేతతో సమావేశం అయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయటం ఖాయమనే వాదన వినిపిస్తోంది. కానీ, బీజేపీ నుంచి స్పష్టత రావటం లేదు. దీంతో..బీజేపీ నేతలతో సమావేశం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. అటు పవన్ తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ నెలలోనే కలిసి సభలు నిర్వహించాలని ఇద్దరు నేతలు నిర్ణయించినట్లు సమాచారం.