AP

నా ఫోన్ ట్యాప్ చేసి బెదిరించి.. కోట్లు ఎత్తుకెళ్లారు: సంధ్య కన్వేన్షన్స్ ఎండీ..

తెలంగాణలో సంచలం రేపుతున్న ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులు తనఫోన్ ట్యాప్ చేశారంటూ.. సంధ్య కన్వేన్షన్స్ ఎండీ శ్రీధర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్య శ్రీధర్ రావును దర్యాప్తు బృందం విచారణకు రావాలని బంజారాహిల్స్‌ పీఎస్‌కు పిలిచింది.

 

విచారణ అధికారుల పిలుపు మేరకు.. సంధ్య శ్రీధర్‌రావు తన అడ్వకేట్స్‌తో కలిసి బంజారాహిల్స్‌ పీఎస్‌కు వెళ్లారు. ప్రస్తుతం శ్రీధర్‌రావు స్టేట్మెంట్‌ను అధికారులు రికార్డు చేస్తున్నారు. తన ఫోన్ ట్యాప్ చేశారని గతంలో పంజాగుట్ట పీఎస్‌లో సంధ్య శ్రీధర్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో రాధాకిషన్ పేరును సైతం ప్రస్తావించారు. తన ఇంటికి వచ్చి కోట్ల రూపాయలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వ‌చ్చిన సంధ్య కన్వేన్షన్స్ ఎండీ శ్రీధర్‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అడిషనల్ ఎస్పీ భుజంగరావు తన ఫోన్ ట్యాపింగ్ చేసి ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపించారు. ఆఫీసుకు పిలిపించి బెదిరించాడని, ఆ వివరాలన్నీ దర్యాప్తు బృందానికి ఇచ్చానని శ్రీధ‌ర్‌రావు తెలిపారు. గ‌త ప్ర‌భుత్వం అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేసిందన్నారు.

 

ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఉత్త‌ర్వులు జారీ చేశారు. కాగా ఇప్పటివరకు ఈ కేసులో ఎ1 గా మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, ఎ2 గా ప్రణీత్ రావు, ఎ3 గా రాధాకిషన్ రావు, ఎ4గా భుజంగరావు, ఎ5గా తిరుపతన్న ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న వీరిరువురి కస్టడీ ముగుస్తుంది.